
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్ధాయి బడ్జెట్‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సిద్ధమవుతున్న క్రమంలో అందరి అంచనాలూ మిన్నంటాయి. వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూనే ద్రవ్య లోటుపోట్లు మితిమీరకుండా వ్యవహరించడం జైట్లీకి కత్తిమీద సామే. అందరినీ సంతృప్తి పరుస్తూ.. పరిమితులకు కట్టుబడుతూ బడ్జెట్ కసరత్తును విజయవంతంగా చేపట్టేందుకు ఆరుగురు అధికారులు ఆర్థిక మంత్రికి అండగా నిలచి అన్నీ తామై నడిపించారు.
రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అథియా, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ప్రభుత్వ వ్యయ శాఖ కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝా, పెట్టుబడులు, ప్రభుత్వ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి నీరజ్ కుమార్ గుప్తా, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ బడ్జెట్ కసరత్తులో కీలకంగా వ్యవహరించారు. ఈ ఆరుగురు అధికారుల బృందంలో కొందరు అధికారులు ఎన్నో బడ్జెట్‌లను చూడగా, ఆయా రంగాల్లో అపార అనుభవం ఉన్నా ప్రత్యక్షంగా బడ్జెట్ కసరత్తులో తొలిసారి పాలుపుంచుకున్న వారూ ఉన్నారు.కాగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.