మార్కెట్లు కుమ్మేస్తున్నాయ్‌.. ఎన్నాళ్లీ జోరు?! | Sakshi
Sakshi News home page

మార్కెట్లు కుమ్మేస్తున్నాయ్‌.. ఎన్నాళ్లీ జోరు?!

Published Sat, Jul 18 2020 1:18 PM

Liquidity driving the rally in markets, no sudden fall: says experts - Sakshi

ఓవైపు ప్రపంచ దేశాలన్నిటినీ కరోనా వైరస్‌ కుదిపేస్తున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకెళుతున్నాయి. యూఎఎస్‌ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెన్సెక్స్‌ 37,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్ల దారెటు అన్న సందేహాలు ఇన్వెస్టర్లను మనసులను తొలుస్తున్నట్లు పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌సహా.. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ), బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే), బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌(బీవోఈ) తదితర కేంద్ర బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను నేలకు దించాయి. అంతేకాకుండా భారీ ప్యాకేజీల ద్వారా బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా కోవిడ్‌-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌లతో నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు ఆర్థిక రికవరీతోపాటు.. స్టాక్‌ మార్కెట్లపట్ల విశ్వాసం పెరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జెఫరీస్‌ ఈక్విటీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌, ఫస్ట్‌ గ్లోబల్‌ విశ్లేషకులు శంకర్‌ శర్మ, ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాశేష్‌ షా వెల్లడించిన అభిప్రాయాలు, అంచనాల వివరాలు చూద్దాం..  

క్రిస్‌ ఉడ్‌, జెఫరీస్‌
నిజానికి ఇండియాసహా వర్ధమాన దేశాలలోని ప్రజలకు కరోనా వైరస్‌ కంటే లాక్‌డవున్‌లే అత్యధికంగా చేటు చేస్తాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న విధానాలలో మార్పులే అతిపెద్ద రిస్క్‌గా చెప్పవచ్చు. సరళతర పాలసీల అమలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తోంది. దేశీయంగా చూస్తే ఐటీ, ఫార్మా రంగాలను కీలకంగా పేర్కొనవచ్చు. వీటికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు తక్కువే. అయితే ఆర్థిక మందగమనం, మొండి బకాయిలు దేశానికి సమస్యలు సృష్టించే వీలుంది. హౌసింగ్, నిర్మాణ రంగాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ లాక్‌డవున్‌ కారణంగా రియల్టీ మార్కెట్‌ దెబ్బతింటోంది.  ఇతర పెట్టుబడి మార్గాలలో బంగారం మరింత మెరిసే వీలుంది. ఔన్స్‌ 1900 డాలర్లను అధిగమించవచ్చు. ఇటీవల వ్యాక్సిన్లపై పెరుగుతున్న అంచనాలు కృత్రిమతకు దారితీస్తున్నాయి. నిజానికి వ్యాక్సిన్ల అవసరం ఉన్నదని భావించడంలేదు.

శంకర్‌ శర్మ, ఫస్ట్‌ గ్లోబల్‌
మార్కెట్ల ర్యాలీకి ఇండెక్స్‌ హెవీవెయిట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యధికంగా సహకరిస్తోంది. ఇటీవల మార్కెట్ల మొత్తం ర్యాలీలో ఈ కౌంటర్‌ కీలకపాత్ర పోషించింది. ఒకే కౌంటర్‌పై ఆధారపడి మార్కెట్లు పరుగందుకుంటే ఆందోళనలు తలెత్తుతాయి. గత మూడు నెలల్లో చూస్తే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, రియల్టీ కేటగిరీలో తొలుత ర్యాలీరాగా..  తదుపరి రిలయన్స్ వల్ల మార్కెట్‌ పురోగమించింది. ఇటీవల రిలయన్స్‌ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా మరింత బలపడటంతో ఈ షేరు చాలా వేగంగా దౌడు తీసింది. మూడు నెలల్లోనే రెట్టింపయ్యింది. దీంతో ఇకపై లాభాల స్వీకరణకు దారితీయవచ్చు.  ఈ ఏడాది దేశీ మార్కెట్లు 24 శాతం క్షీణించాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే వెనుకబడ్డాయి. అయితే కొన్ని రంగాలలో అత్యంత ఆకర్షణీయమైన స్టాక్స్‌ ఉన్నాయి. అలాగని బుల్‌ మార్కెట్‌కు అవకాశంలేదు. కొన్ని స్టాక్స్‌ ఆధారంగా కదిలే మార్కెట్‌గా కనిపిస్తోంది.

రాశేష్‌ షా, ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌
స్వల్పకాలిక ఆర్థిక గణాంకాలను మార్కెట్లు పట్టించుకోవడం లేదు. మార్చి, ఏప్రిల్‌లో చూస్తే.. కరోనా వైరస్‌ కారణంగా అనూహ్య భయాలు నెలకొన్నాయి. ఇది ఎలా అంతమవుతుందన్న అంశాన్ని ఎవరూ ఊహించలేదు. అయితే లిక్విడిటీతో స్వల్పకాలిక ఒత్తిడి తొలగిపోయింది. స్వల్పకాలంలో లిక్విడిటీ ఆదుకోగా.. తదుపరి దశలో అంటే డిసెంబర్‌, జనవరికల్లా కోవిడ్‌-19కు తెరపడగలదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థిక గణాంకాలు అంటే జీడీపీ, కంపెనీల ఫలితాలు వంటివి నిరాశపరుస్తాయన్నది తెలిసిన సంగతే. దీంతో ఆపై అంటే  2021 తదుపరి పరిస్థితులపట్ల ఇన్వెస్టర్లు ఆశావహంగా స్పందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement