ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న సరళ పరపతి విధానాలే ఆర్థిక సంక్షోభాలకు ఆజ్యం
వాషింగ్టన్ : ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న సరళ పరపతి విధానాలే ఆర్థిక సంక్షోభాలకు ఆజ్యం పోస్తున్నాయన్న వాదనలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తోసిపుచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1930 నాటి మహా మాంద్యం తరహా సమస్యలోకి జారిపోతోందని.. దీనికి ప్రధానంగా సెంట్రల్ బ్యాంకులు పోటాపోటీగా ప్రకటిస్తున్న సహాయ ప్యాకేజీలు, సరళ పాలసీలే కారణమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఒక్క సరళ పాలసీవల్లే ఆర్థిక సంక్షోభాల్లోకి జారిపోతున్నామంటూ నిందించడం తగదని ఐఎంఎఫ్ తన పరిశోధన పత్రంలో పేర్కొంది. గత సంక్షోభాలకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడేందుకు పటిష్టమైన నియంత్రణ యంత్రాంగం లేకపోవడమేనని తెలిపింది. 2007-08 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్ది మంది ఆర్థికవేత్తల్లో రాజన్ ఒకరు.
రాజన్ అలా అనలేదు...: మహా మాంద్యం తరహా సమస్యల్లోకి జారిపోతున్నామని రాజన్ వ్యాఖ్యానించలేదని ఆదివారం ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. అప్పటి ఆర్థిక మాంద్యానికి కేంద్ర బ్యాంకుల విధానాలతో పాటు పలు కారణాలున్నాయని.. ప్రస్తుత విధానాలు, అప్పటి వ్యూహాల్లా మారిపోవొచ్చని మాత్రమే వ్యాఖ్యానించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.