నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల వాటా విలువ జూన్ ...
ఎఫ్‌ఐఐల వాటా రూ.20 లక్షల కోట్లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల వాటా విలువ జూన్ చివరినాటికి రూ.20.13 లక్షల కోట్లు. మార్చి ముగిసేసరికి ఎఫ్‌ఐఐ హోల్డింగ్స్ రూ.18.37 లక్షల కోట్లు. ప్రైమ్‌డేటాబేస్ ఈ వివరాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల విలువ శాతాల్లో చూస్తే... 37 శాతంతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మారిషన్ 21 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. తరువాత వరుసలో సింగపూర్ (15 శాతం), బ్రిటన్ (7 శాతం), లగ్జంబర్గ్ (4 శాతం) ఉన్నాయి.
విలీనానికి ఎస్‌బీఐ బోర్డ్ ఓకే!
మెగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోడానికి సంబంధించిన ప్రతిపాదనకు ఎస్‌బీఐ బోర్డ్ ఆమోదముద్ర వేసింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ (ఎస్‌బీటీ) ఉన్నాయి. ఇవి లిస్టెడ్ బ్యాంకులు. ఇక వీటితోపాటు అన్‌లిస్టెడ్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర పడింది.
టాప్ ఫార్మా సంస్థల్లో 8 హైదరాబాద్‌వే!
దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్ల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4వ స్థానంలో నిలిచింది. ‘భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016’ పేరిట టీఆర్‌ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఇందులో అరబిందో 11వ స్థానం, నాట్కో 21వ స్థానం దక్కించుకున్నాయి. అటు సువెన్ లైఫ్‌సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ ల్యాబ్ (44), జెనోటెక్ ల్యాబ్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ (52) కూడా జాబితాలో నిలిచాయి. జాబితాలో ముంబైకి చెందిన లుపిన్ అగ్రస్థానంలో, సన్ ఫార్మా రెండు, సిప్లా మూడవ స్థానంలో నిలిచాయి.
ఆర్‌ఐఎల్‌కు రూ.2,500 కోట్ల జరిమానా
పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్) మరో పిడుగు పడింది. కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యాని కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), దాని భాగస్వామ్య కంపెనీలకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాల మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు విధించిన మొత్తం జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు (రూ.18,492 కోట్లు సుమారు) చేరుకుంది.
ఇన్ఫోసిస్‌కు ఆర్‌బీఎస్ షాక్
భారీ కాంట్రాక్టును రద్దు చేసుకుంటూ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్‌బీఎస్) ఇన్ఫోసిస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇన్ఫోసిస్‌లో మూడు వేల ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందని, వచ్చే ఆరు నెలల కాలంలో 4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశముంది. బ్రిటన్ వరకు విలియమ్స్ అండ్ గ్లిన్ (డబ్ల్యూఅండ్‌జీ) బ్యాంకును ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఎస్ ఉపసంహరించుకోవడమే కాంట్రాక్టు రద్దుకు దారితీసింది.
ఏడాది వాలిడిటీతో డేటా ప్యాక్స్
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది వాలిడిటీతో కూడిన మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్‌కి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డేటా ప్యాక్స్ గరిష్ట వాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీర్ఘకాల వాలిడిటీతో కూడిన డేటా ప్యాక్స్‌కు అనుమతించండంటూ యూజర్ల నుంచి పలు విన్నపాలు అందాయని, ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ పేర్కొంది. డేటాను తక్కువగా ఉపయోగించే యూజర్లను దృష్టిలో ఉంచుకొని, అలాగే కొత్త ఇంటర్నెట్ యూజర్‌ను ఆకర్షించేందుకు తమ తాజా చర్య దోహదపడుతుందని వివరించింది.
హైక్ మెసెంజర్ నిధుల సమీకరణ
మెసేజింగ్ ప్లాట్‌ఫాం హైక్ మెసెంజర్ తాజాగా టెన్సెంట్ హోల్డింగ్స్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తదితర సంస్థల నుంచి 175 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు టైగర్ గ్లోబల్, భారతి, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌లు కూడా మరో దఫా నిధులు సమకూర్చాయి. దీంతో కంపెనీ ఇప్పటిదాకా 250 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు కాగా.. సంస్థ విలువ 1.4 బిలియన్ డాలర్లకి చేరింది.