2.5 కోట్ల ఉద్యోగాలకు కోత

Jobs Destroyed Worldwide as Coronavirus Sparks Recession - Sakshi

అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాలు

జెనీవా: కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎల్‌ఒ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌ విస్తరించకుండా వివిధ దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. సగం మందికి పైగా ఇల్లు కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం
► అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువ.  

► యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్‌ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27% సిబ్బందిని తగ్గించారు.  

► స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14% నిరుద్యోగ రేటు నమోదైంది.  
► రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది.

► జర్మనీలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో ఇంచుమించుగా 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.  

► ఫ్రాన్స్‌లో కూడా వివిధ వ్యాపార కంపెనీలు జీతం చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 20% మందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వమే సాయపడాలని కోరాయి

► థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు.

► చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top