జెట్ ఎయిర్‌వేస్ నష్టం రూ. 4,129 కోట్లు
అధిక వ్యయాలు, నిర్వహణపరమైన సవాళ్ల నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2013-14) జెట్ ఎయిర్‌వేస్ రూ. 4,129 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
ముంబై: అధిక వ్యయాలు, నిర్వహణపరమైన సవాళ్ల నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2013-14) జెట్ ఎయిర్‌వేస్ రూ. 4,129 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధిక నష్టంకాగా, వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా లాభదాయకతను పెంచుకునేందుకు మూడేళ్ల బిజినెస్ ప్రణాళికకు తెరలేపింది. దీనిలో భాగంగా కొత్త సీఈవోగా క్రామర్ బాల్‌ను ఎంపిక చేసుకోవడంతోపాటు, బ్యాలన్స్ షీట్‌ను పటిష్టపరచడం, అధిక విలువగల ఆస్తులను విక్రయించడం, వ్యయాల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలకు ఉపక్రమించింది. వీటితోపాటు విమాన సర్వీసులలో సైతం మార్పులు చేస్తూ డెరైక్టర్ల బోర్డు తీర్మానించింది.
బోర్డు సమావేశానికి తొలిసారి అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జెట్ ఎయిర్‌వేస్‌లో 24% వాటాను ఈ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అంతక్రితం ఏడాది(2012-13)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 779 కోట్ల నష్టం నమోదైంది. జనవరి-మార్చి(క్యూ4) కాలానికి కూడా జెట్ ఎయిర్‌వేస్ రూ. 2,153 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. వెరసి వరుసగా ఐదో క్వార్టర్‌లో నష్టాలను నమోదు చేసుకుంది.


