బీపీసీఎల్‌ రేసులో పీఎస్‌యూలకు నో చాన్స్‌ | IOC, other PSUs not to bid for BPCL | Sakshi
Sakshi News home page

బీపీసీఎల్‌ రేసులో పీఎస్‌యూలకు నో చాన్స్‌

Nov 22 2019 6:07 AM | Updated on Nov 22 2019 6:07 AM

IOC, other PSUs not to bid for BPCL - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్‌యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్‌తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో  ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది.  

వ్యాపారం... ప్రభుత్వ పని కాదు..
వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, 2014 నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్నామని ప్రధాన్‌ పేర్కొన్నారు. టెలికం, విమానయాన రంగాల్లో ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించినందువల్లే పోటీ పెరిగి వినియోగదారులకు చౌకగా సేవలందు తున్నాయని వివరించారు. బీపీసీఎల్‌కు అస్సాం లో ఉన్న నుమాలీఘర్‌ రిఫైనరీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అస్సామ్‌ ముఖ్యమంత్రి కోరారని ప్రధాన్‌ చెప్పారు. ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని వివరించారు. బీపీసీఎల్‌  ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. పోటీని పెంచడానికే బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్నామని తెలిపారు.  

ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా కార్యకలాపాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ప్రధాన్‌ చెప్పారు. అందుకే వాటిల్లో వాటాను విక్రయిస్తున్నామని, ఫలితం గా ఆ సంస్థల పనితీరు మరింతగా మెరుగుపడుతుందని వివరించారు. ఇక్కడ జరిగిన ఏఎస్‌ఏ స్టీల్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. సెయిల్, ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement