ఏడాది మారింది... మరి మీరు?

Investments Increased instability in stock markets - Sakshi

కాలానికి అనుగుణంగా పెట్టుబడులు

స్టాక్‌ మార్కెట్లలో పెరిగిన అస్థిరతలు

సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయడమే మెరుగు

లార్జ్‌క్యాప్‌కు ప్రత్యామ్నాయం మల్టీక్యాప్‌ ఫండ్స్‌

మూలధన లాభాల పన్ను పడకుండానూ మార్గం

ఎఫ్‌ఎంపీ, ఎన్‌పీఎస్, షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌... ఎన్నో ఆప్షన్లు  

గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ప్రతికూలతలను అధిగమించి, పెట్టుబడి అవకాశాలను అందుకోవాలంటే అందుకు ప్రతి ఒక్కరూ పాటించతగిన ఆర్థిక విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటన్నది నిపుణుల మాటల్లోనే...
– సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు అధిక అవకాశాలున్నాయి. ఈ అస్థిరతలను అధిగమించేందుకు సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ఉపయోగపడుతుంది. ఎన్నికల వరకు స్టాక్స్‌ ధరలు పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడ్డాక దిశను ఎటువైపు అయినా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్టర్లు సిప్‌ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్‌ చేయడమే సరైన మార్గం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఎన్‌ఏవీ ధరలు పెరగడం వల్ల తక్కువ ఫండ్స్‌ యూనిట్లు, మార్కెట్లు కరెక్షన్‌ బాట పడితే ఎన్‌ఏవీ ధరల పతనంతో ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు కొంతమేర కరెక్షన్‌కు గురైన ఈ సమయంలో సిప్‌ను ఆపకూడదు. దీనివల్ల తక్కువ ధరలకు ఎన్‌ఏవీలను కొనుగోలు చేసుకునే అవకాశం కోల్పోతారు. ముఖ్యంగా 12–18 నెలల క్రితం సిప్‌ ఆరంభించిన వారు కచ్చితంగా ఈ సమయంలో ఆపకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏడాది, ఏడాదిన్నర క్రితం మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. కనుక గరిష్ట ధరల్లో పెట్టుబడి పెట్టిన వారు, ఇప్పుడు తక్కువ ధరకే కొనే అవకాశాన్ని కోల్పోకూడదు.  

లార్జ్‌క్యాప్‌నకు ప్రత్యామ్నాయాలు
చాలా వరకు ప్రధాన లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ గతేడాది మెరుగైన పనితీరు చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా వీటి పనితీరు అంత బాగుండకపోవచ్చనే అంచనా ఉంది. అధిక రాబడులు కోరుకునే వారు అధిక రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100, రిలయన్స్‌ లార్జ్‌క్యాప్, యూటీఐ మాస్టర్‌షేర్‌ పథకాలన్నీ గతేడాది ఒక శాతం నుంచి రెండున్నర శాతం నష్టాలను మిగిల్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ– 50 సూచీ 3 శాతం రాబడులను ఇచ్చింది.

కనుక లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌కు బదులు ఈ సమయంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచి నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ భిన్న మార్కెట్‌ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయని వారు సూచిస్తున్నారు. దీంతో అధిక రాబడులిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్‌ కాస్త తక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... మల్టీక్యాప్‌ ఫండ్స్‌ అయినప్పటికీ క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్‌) ద్వారా కనీసం ఐదేళ్లు ఆపైన ఇన్వెస్ట్‌ చేయడం ద్వారానే మెరుగైన రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

పన్ను భారం తగ్గించుకోవచ్చు
ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కూడా ఈక్విటీల్లోకి, మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆగలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. సిప్‌ ద్వారా 2018లో వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం వృద్ధి నెలకొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాల మూలధన లాభం పొందితే దానిపై 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే, ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే లాభాల్లో ఇది స్వల్ప మొత్తమేనని ఇన్వెస్టర్లు అర్థం చేసుకున్నట్టున్నారు.

నిజానికి 10 శాతం పన్ను రాబడులను పెద్దగా ప్రభావం చేసేది కాదని నిపుణుల అభిప్రాయం కూడా. నెలకు సిప్‌ ద్వారా రూ.5,000– 10,000 మొత్తం ఇన్వెస్ట్‌ చేసే వారిపై ఇప్పటికిప్పుడు ఈ పన్ను ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ స్వల్ప మొత్తంపై ఏడాదిలో వచ్చే లాభాలు పన్ను పడే స్థాయిలో ఉండవు. అదే రూ.30,000– 50,000 మధ్య ఇన్వెస్ట్‌ చేసే వారయితే వార్షికంగా 12 శాతం రాబడులు వచ్చాయనుకుంటే రెండేళ్ల తర్వాత మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తారు. రెండేళ్లలో వారు పొందే లాభం రూ.లక్ష దాటుతుంది.

ఆ మొత్తాన్ని ఒకే ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ పన్ను కూడా చెల్లించకుండా మార్గం ఉంది. ఏడాది దాటాక ప్రతీ నెలా అంతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటూ తిరిగి అదే ఫండ్‌ లేదా మరో ఫండ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. దీంతో పన్ను వర్తించేంత లాభాలు రాకముందే తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2018 ఏప్రిల్‌ నెలలో ఓ ఫండ్‌లో ఎన్‌ఏవీ రూ.25 వద్ద రూ.25,000 ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. 1,000 యూనిట్లు వచ్చి ఉంటాయి. 2019 ఏప్రిల్‌ నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆ మరుసటి నెలలోనే వెయ్యి యూనిట్లను రెడీమ్‌ చేసుకుని తిరిగి ఇన్వెస్ట్‌ చేయాలి. ఇలా ప్రతీ సిప్‌కు ఏడాది పూర్తయిన వెంటనే తిరిగి ఇన్వెస్ట్‌ చేస్తుంటే సరి.  

మల్టీ ఇయర్‌ హెల్త్‌ ప్లాన్‌
వైద్య బీమాకు ఏటా ప్రీమియం చెల్లించాలి. లేదంటే కవరేజీ ఆగిపోతుంది. దీనికి బదులు ఒకేసారి రెండేళ్లకు ప్లాన్‌ తీసుకుని ప్రీమియం చెల్లించడం వల్ల తగ్గింపుతోపాటు... ఏడాదికే ప్రీమియం చెల్లించాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. న్యూఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ 2017లో వృద్ధుల వైద్య బీమా ప్రీమియంను ఒకేసారి రెట్టింపునకు పైగా పెంచింది. కనుక ఒకేసారి ఎక్కువ సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం వల్ల తగ్గింపు ఒక్కటే కాదు, ప్రీమియం పెరిగే భారం కూడా కొంత వరకు తప్పించుకున్నట్టు అవుతుంది.

ఎన్‌పీఎస్‌ కూడా చూడొచ్చు..
జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) విశ్రాంత జీవనం కోసం ప్రణాళికలు వేసుకునే వారికి అనువైన సాధనాల్లో ఒకటి. ఇందులో చార్జీలు ఇతర సాధనాలతో పోలిస్తే తక్కువ. ఈక్విటీ, డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంలో 20 శాతంపై పన్ను ఉండేది. ఇది నచ్చక చాలా మంది దీనికి దూరంగా ఉండిపోయారు. అయితే, ఎన్‌పీఎస్‌ పథకం నుంచి రిటైర్మెంట్‌ వయసులో ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని తెలిసిందే. ఇక ఈక్విటీల్లో యాక్టివ్‌ చాయిస్‌ కింద 75 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎన్‌పీఎస్‌ నిర్వహణను చూసే పీఎఫ్‌ఆర్‌డీఏ గతేడాది అక్టోబర్‌లో మరో నిర్ణయం తీసుకుంది.

70 ఏళ్లు వచ్చే వరకూ కూడా ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అనుమతించింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా రెండంకెల రాబడులు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఈక్విటీలకు 50 శాతం వరకు కేటాయించుకునే వారికి 11.31 శాతం చొప్పున వార్షిక రాబడులు, పూర్తిగా డెట్‌కే పరిమితమైన వారికి వార్షికంగా 10.55 శాతం చొప్పున పెట్టుబడుల వృద్ధి ఉంది. ఇక పన్ను ప్రయోజనాలు అదనం. బేసిక్‌ వేతనంలో 10 శాతాన్ని సెక్షన్‌ 80సీసీడీ(2) కింద ఉద్యోగి తరఫున కంపెనీ ఎన్‌పీఎస్‌కు జమ చేస్తే పన్ను ఉండదు. అలాగే, సెక్షన్‌ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో రూ.50,000 పెట్టుబడిపైనా పన్ను ఉండదు. కనుక దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన పథకంగా ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సూచన.

విదేశీ ఫండ్స్‌లో కూడా...
అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఎన్‌ఏవీల ధరలు కొంత కాలం క్రితం వరకూ బాగా పెరిగాయి. తాజాగా అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో వాటి ఎన్‌ఏవీలు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన అమెరికా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికన్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఎన్నో అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. బలమైన బ్రాండ్, మార్కెట్‌ వ్యాల్యూ, బలమైన నగదు ప్రవాహాలు వంటి అంశాలను చూస్తాయి. పైగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కూడా పెట్టుబడుల విలువ పెరిగేందుకు దోహదపడుతుంది. కనుక తమ పిల్లలను విదేశీ విద్యకు పంపించాలనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌లో ముందునుంచే ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  

రుణాన్ని బదలాయించుకుంటే...?
రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు వాటి అంతర్గత బెంచ్‌ మార్క్‌ రేటుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పారదర్శకత తక్కువగా ఉంటోంది. దీనికి బదులు రెపో రేటు, 91, 182 రోజుల ట్రెజరీ బిల్లు ఈల్డ్‌ రేటు లేదా ఏదైనా ఇతర బెంచ్‌ మార్క్‌ మార్కెట్‌ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను అనుసరించాలని ఆర్‌బీఐ ఇటీవలే ఆదేశించింది. గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలకూ ఇది అమలుకానుంది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు తక్కువ రేట్లకే రుణం లభించే పరిస్థితులకు ఇది దారితీస్తుంది. కనుక అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు దాన్ని తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం మంచి ఆలోచన అవుతుంది.  రుణం తొలి నాళ్లలో ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీకే వెళుతుంది. కనుక మొదట్లోనే రుణాన్ని బదలాయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ.

పెద్దల పేరు మీద పెట్టుబడి
60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా పొందే రూ.50వేల వడ్డీ ఆదాయానికి పన్నును మినహాయిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 60 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు ఏటా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక తమ తల్లిదండ్రులకు పన్ను వర్తించేంత ఆదాయం లేకపోతే, వారికి గిఫ్ట్‌గా ఇచ్చి, వారి పేరిట డిపాజిట్‌ చేయడం మంచి ఆలోచన. ఇది చట్టబద్ధం కూడా. పైగా బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు అర శాతం వరకు అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యా, పిల్లలకు గిఫ్ట్‌ ఇచ్చి వారి పేరిట ఇన్వెస్ట్‌ చేసినా, అది గిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి ఆదాయం కిందే చట్టం పరిగణిస్తుంది. తల్లిదండ్రులకు గిఫ్ట్‌ ఇస్తే మోసపూరిత లావాదేవీగా చట్టం పరిగణించదని ట్యాక్స్‌స్పానర్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్‌కౌశిక్‌ తెలిపారు.  


షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌
ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా ఆటుపోట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ సమయంలో దీర్ఘకాల డెట్‌ ఫండ్స్‌ కంటే షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ అనుకూలమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాల ఫండ్స్, దీర్ఘకాలంలో గడువు తీరే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇంక్రిమెంటల్‌ రిస్క్‌ తీసుకున్నా గానీ దీర్ఘకాల డెట్‌ ఫండ్స్‌ తగినంత రాబడులను ఆఫర్‌ చేయడం లేదని, వీటికి బదులు మూడేళ్ల లోపు గడువు తీరే షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో ధావల్‌ దలాల్‌ సూచించారు. బలమైన క్రెడిట్‌ ప్రొఫైల్‌ (రుణ చరిత్ర) ఉన్న కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చని కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగం హెడ్‌ అవనీష్‌ జెయిన్‌ సూచన. 2–5 ఏళ్ల   కాలానికి ఇవి మంచి రాబడులను ఆఫర్‌   చేస్తున్నట్టు తెలిపారు.

ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు
డెట్‌ ఫండ్స్‌లో వడ్డీ రేట్ల రిస్క్‌ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు ఆ ప్రయోజనం నష్టపోతారు. ఈ రకమైన రిస్క్‌ వద్దనుకునేవారు ఎఫ్‌ఎంపీలను పరిశీలించొచ్చు. ఇవి డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసి గడువు తీరే వరకు కొనసాగుతాయి. దాంతో బాండ్‌ ఈల్డ్స్‌కు అనుగుణంగానే రాబడులు ఉంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top