
సెప్టెంబర్‌లో రూ.లక్ష కోట్లు వెనక్కి
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సెప్టెంబర్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఏకంగా రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. అంతకుముందు ఆగస్ట్ నెలలో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకున్న మొత్తం రూ.7,980 కోట్లుగానే ఉంది. సంస్థాగత ఇన్వెస్టర్లు లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తంలో (రూ.66,042 కోట్లు) వెనక్కి తీసుకోవడమే ఇందుకు కారణమని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) డేటా తెలియజేస్తోంది. జూలైలోనూ డెట్ మ్యూచువల్ ఫండ్స్ రూ.1.07 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం.
డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 12 విభాగాల ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ పెట్టుబడుల విలువ 5 శాతం తగ్గి రూ.17.8 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆగస్ట్ చివరికి ఈ మొత్తం రూ.18.71 లక్షల కోట్లుగా ఉంది. ‘బడా సంస్థలు త్రైమాసికం చివర్లో నిధులపరమైన సర్దుబాట్లు, ముందస్తు పన్ను చెల్లింపుల అవసరాల దృష్ట్యా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉండొచ్చు’’అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ మేనేజర్ నేహల్ మెష్రామ్ తెలిపారు.