ఇన్ఫోసిస్ లాభం రూ.4,272 కోట్లు

12 శాతం వృద్ధి
రూ.23,665 కోట్లకు ఆదాయం
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్‌లో రూ.4,272 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది (2019–20) ఇదే క్వార్టర్‌లో రూ.3,802 కోట్ల నికర లాభం వచ్చిందని 12 శాతం వృద్ధి సాధించామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఈ క్యూ1లో భారీ డీల్స్ సాధించడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. ఆదాయం రూ.21,803 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.23,665 కోట్లకు చేరిందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1.5 శాతం మేర (స్థిర కరెన్సీ పరంగా) వృద్ధి చెందగలదని, నిర్వహణ మార్జిన్ 21–23 శాతం మేర ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి.
► డాలర్ల పరంగా నికర లాభం 3 శాతం వృద్ధితో 56 కోట్ల డాలర్లకు పెరిగింది. ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి 312 కోట్ల డాలర్లకు చేరింది.
► డిజిటల్ విభాగం ఆదాయం 25 శాతం వృద్ధితో 138 కోట్ల డాలర్లకు పెరిగింది. క్యూ1లో 170 కోట్ల డాలర్ల డీల్స్‌ను సాధించింది.
► గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 360 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. రుణభారం లేదు.
► ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,39,233గా ఉంది. ఆట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) 11.7 శాతంగా ఉంది.
20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు
జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారిలో దాదాపు 90% మంది ఉద్యోగాల్లో చేరారని కంపెనీ సీఓఓ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. మిగిలిన వాళ్లు ఈ క్వార్టర్‌లో చేరతారని పేర్కొన్నారు. 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నామని వివరించారు. హెచ్1–బి వర్క్ వీసాలపై నిషేధం మతిలేని చర్య అని వ్యాఖ్యానించారు. ఇది తమపై పెద్దగా ప్రభావం చూపదని వివరించారు.
మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై సానుకూల అంచనాలతో ఇన్ఫోసిస్ షేర్ 6% లాభంతో రూ.831 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.848ను తాకింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి