
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 25 శాతం వృద్ధితో రూ.936 కోట్లకు పెరిగింది. గత క్యూ3లో లాభం రూ.751 కోట్లు. కోర్ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్ చీఫ్ రమేశ్ సోబ్తి చెప్పారు. మొత్తం ఆదాయం రూ.4,716 కోట్ల నుంచి 16% వృద్ధితో రూ.5,474 కోట్లకు పెరిగిందని చెప్పారు.
నికర వడ్డీ ఆదాయం 20 శాతం అప్...
డిపాజిట్లు 23 శాతం, రుణాలు 25 శాతం చొప్పున వృద్ధి చెందాయని రమేశ్ సోబ్తి తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.1,895 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 22 శాతం పెరిగి రూ.1,077 కోట్లకు వృద్ధి చెందిందన్నారు. స్థూల మొండి బకాయిలు 0.94% నుంచి 1.16%కి, నికర మొండి బకాయిలు 0.39% నుంచి 0.46%కి పెరిగాయని సోబ్తి తెలిపారు. ఫలితాల నేపథ్యంలో ఇండస్ ఇండ్ షేరు 2 శాతం నష్టంతో రూ.1,699 వద్ద ముగిసింది.