పదేళ్లలో భారత్‌ జీడీపీ రెట్టింపు

India's GDP will double in ten years - Sakshi

ఏడీబీ అంచనా

మనిలా:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ అంచనా జీడీపీ వృద్ధి 7 శాతం ‘అత్యంత వేగవంతమైనదని’ ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ...ఇదే వేగం కొనసాగితే వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపవుతుందని వ్యాఖ్యానించింది. 8 శాతం వృద్ధి సాధించలేకపోతున్నామన్న ఆందోళన భారత్‌కు వద్దని, దేశంలో ఆదాయ అసమతౌల్యాన్ని తొలగించడం ద్వారా దేశీయ డిమాండ్‌ పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ఏడీబీ చీఫ్‌ ఎకానమిస్ట్‌ యసుయూకి సావాడా సూచించారు.

ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వృద్ధి అనేది ఎగుమతులకంటే వినియోగం ద్వారానే సాధ్యపడుతుందన్నారు. భారత్‌ జీడీపీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2019–2020లో 7.6 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని ఏడీబీ అంచనా వేసింది. అయితే 2017–2018 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.6 శాతానికే పరిమితమవుతుందని అంచనా.

2016–17లో సాధించిన 7.1 శాతం వృద్ధికంటే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు తగ్గనుంది. ఏడు శాతం వృద్ధి అంటేనే అత్యంత వేగవంతమైనదని, అలాంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.6 శాతం చొప్పున వృద్ధిచెందడమంటే అద్భుతమైన అంశమని సావాడా విశ్లేషించారు. అయితే భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన పెద్ద సవాలేనని, అంత వృద్ధి సాధించలేకపోతున్నామన్న ఆందోళన అక్కర్లేదని ఆయన అన్నారు.   

పేదరిక నిర్మూలన ముఖ్యం...
ఆదాయ అసమతౌల్యాన్ని తొలగించడం, పేదరికాన్ని నిర్మూలించడం అధిక వృద్ధి సాధనలో ముఖ్యపాత్ర వహిస్తాయని సావాడా అన్నారు. వినియోగం పెరిగితే..ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఉపాధి కల్పన జరుగుతుందని ఆయన వివరించారు. పేదల జీవనప్రమాణాలు మెరుగుపడితే..వారు మంచి వినియోగదారులుగా అవతరిస్తారని అన్నారు.

ఎగుమతులు కూడా అధిక వృద్ధిసాధనలో భాగమే అయినప్పటికీ, భారత్‌ వృద్ధి మాత్రం అధికంగా దేశీయ మార్కెట్‌ మీద ఆధారపడిందేనని అన్నారు.  సర్వీసుల రంగం కూడా అధిక వృద్ధి సాధనలో తగిన పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top