ధరలో సగం సుంకాలే.. ఇది దారుణం !

Indias 50% import tariff on Harley Davidson unacceptable - Sakshi

సుంకాలను పూర్తిగా తొలగించాల్సిందే  

ఇక భారత్‌తో వాణిజ్య యుద్ధం!  

వాషింగ్టన్‌: అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్‌ బైక్‌లపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్‌ బైక్‌ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28–29 మధ్య జీ20 సమావేశంలో మోదీతో ఆయన సమావేశం కానున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్థిక దృష్టితో మాత్రమే చూసే డొనాల్ట్‌ ట్రంప్, భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా అభివర్ణించారు. భారత ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆయన హెచ్చరించారు. హార్లే డేవిడ్సన్‌ బైక్‌లపై  ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతయ్యే బైక్‌లపై విధిస్తున్న సుంకాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సుంకాల విషయమై సుదీర్ఘకాలంగా అమెరికా దోపిడీకి గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు 80,000 కోట్ల డాలర్ల మేర ఉందని పేర్కొన్నారు.  చైనా తర్వాత ట్రంప్‌ తదుపరి లక్ష్యం భారతేనని అమెరికా మీడియా భావిస్తోంది. ఈ–కామర్స్, డేటా లోకలైజేషన్‌పై భారత్‌  ఆంక్షలు అమెరికా కంపెనీలపై బాగా నే ప్రభావం చూపాయని, ఇది భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనుందని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top