న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలికరంగం ఫిబ్రవరిలో మందగమనంలో ఉంది. వృద్ధి కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో బలహీన ధోరణి దీనికి కారణం.  2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం. సోమవారం విడుదలైన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... 
►క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా వరుసగా –6.1 శాతం, –0.8 శాతం చొప్పున  క్షీణించాయి.  
►ఎరువులు (5.2 శాతం నుంచి 2.5 శాతం), స్టీల్ (5 శాతం నుంచి 4.9 శాతం), సిమెంట్ (23 శాతం నుంచి 8 శాతం) విద్యుత్ (4.6 శాతం నుంచి 0.7 శాతం) రంగాల ఉత్పత్తుల్లో వృద్ధి ఉన్నప్పటికీ ఈ రేటు తగ్గింది. 
►అయితే బొగ్గు, సహజ వాయువుల రంగాల్లో మాత్రం వృద్ధి 7.3 శాతం, 3.8 శాతం చొప్పున నమోదయ్యాయి.  
►కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నెలల్లో చూస్తే, మౌలిక రంగం వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది.   

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
