కెయిర్న్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందే..: కేంద్రం స్పష్టీకరణ | Income Tax department slaps Rs 29000 crore tax demand notice on Cairn Energy | Sakshi
Sakshi News home page

కెయిర్న్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందే..: కేంద్రం స్పష్టీకరణ

Mar 17 2016 1:19 AM | Updated on Aug 20 2018 9:16 PM

కెయిర్న్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందే..: కేంద్రం స్పష్టీకరణ - Sakshi

కెయిర్న్ వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాల్సిందే..: కేంద్రం స్పష్టీకరణ

బడ్జెట్‌లో ప్రకటించిన వన్‌టైమ్ పన్ను సెటిల్‌మెంట్‌కు బ్రిటిష్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ ఒప్పుకునేవరకూ రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో ప్రకటించిన వన్‌టైమ్ పన్ను సెటిల్‌మెంట్‌కు బ్రిటిష్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ ఒప్పుకునేవరకూ రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. 2006లో కెయిర్న్ ఎనర్జీ భారత్ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో ఆర్జించిన మూలధన లాభాలకు గాను పన్ను, వడ్డీ రూపంలో దాదాపు రూ.29 వేల కోట్లను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తుది నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెట్రోస్పెక్టివ్(పాత లావాదేవీలకూ పన్ను వర్తింపు) పన్ను వివాదాలకు తెరదించే చర్యల్లో భాగంగా 2016-17 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి జెట్లీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఆఫర్‌ను ప్రకటించారు. అంటే రెట్రోస్పెక్టివ్ పన్నుకు సంబంధించి అసలు మొత్తాన్ని చెల్లిస్తే.. వడ్డీ, జరిమానాలను మాఫీ చేస్తారు.

‘ఈ అవకాశాన్ని కంపెనీలు వినియోగించుకోవచ్చు. అప్పటివరకూ సాధార రికవరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే వడ్డీని కూడా కలిపి తుది పన్ను నోటీసులను కెయిర్న్ ఎనర్జీకి పంపడం జరిగింది’ అని ఉన్నతస్థాయి  వర్గాలు వెల్లడించాయి. కెయిర్న్ ఎనర్జీకి ఇచ్చిన తుది నోటీసుల్లో రెట్రోస్పెక్టివ్ పన్ను రూపంలో రూ.10,247 కోట్లు ఉండగా.. 2007 నుంచి లెక్కించిన వడ్డీ మొత్తం రూ.18,800 కోట్లు కావడం గమనార్హం. కాగా, కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణపై రెట్రోస్పెక్టివ్ పన్ను విధింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియను  మొదలుపెట్టినట్లు కెయిర్న్ ఎనర్జీ పేర్కొంది కూడా. అంతేకాకుండా బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,700 కోట్లు) నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement