ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్‌ తక్కువే!

ICICI Prudential Equity Savings - Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌

ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్‌ చేయాలి, అదే సమయంలో పెట్టుబడులకు రిస్క్‌ కొంత తక్కువగా ఉండాలని ఆశించే వారు ఈక్విటీ, డెట్‌ కలయికతో కూడిన ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌ పథకం రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. ఈక్విటీ, డెట్‌తోపాటు, ఆర్బిట్రేజ్‌ అవకాశాల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ ఇ¯Œ కమ్‌ పేరుతో ఈ పథకం కొనసాగింది. 

రాబడులు..: ఈ పథకం 2014లో ఆరంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే మంచి రాబడులను ఇచ్చింది. ఈక్విటీ సేవింగ్స్‌ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు ఈ పథకంలో రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం 8.5 శాతం, రెండేళ్లలో వార్షికంగా 6.8 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.2 శాతం చొప్పున ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడులు ఏడాదిలో 5.2 శాతం, రెండేళ్లలో 5.1 శాతం, మూడేళ్లలో 7.4 శాతంగానే ఉన్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలి, అదే సమయంలో రిస్క్‌ తక్కువగా ఉండాలనుకునే వారికి ఈక్విటీ సేవింగ్స్‌ పథకాలు అనుకూలంగా ఉంటాయి. రిస్క్‌ ఆధారిత రాబడుల విషయంలో ఈ విభాగం అటు కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్, ఇటు అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు మధ్యస్థంగా ఉంటాయి. ఈ పథకం ఈక్విటీ, ఈక్విటీ ఆర్బిట్రేజ్‌కు కనీసం 65 శాతం కేటాయింపులు చేస్తుంది. పన్ను పరంగా ఈక్విటీ ఆర్బిట్రేజ్‌ పెట్టుబడులు కూడా ఈక్విటీగానే పరిగణించబడతాయి. డివిడెండ్, మూలధన లాభాలపై పన్ను ఉంటుంది. ఇన్వెస్టర్ల లక్ష్యాలను బట్టి కనీసం మూడేళ్లు, అంతకు మించిన కాలానికి ఈ పథకాలను పరిశీలించొచ్చు.

పెట్టుబడుల విధానం..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌ పథకం ఈక్విటీలకు 15–50 శాతం వరకు పెట్టుబడులను కేటాయిస్తుంది. డెట్‌కు 10–35 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. మార్కెట్‌ పరిస్థితులను బట్టి 25–75 శాతం మధ్య ఆర్బిట్రేజ్‌ వ్యూహాలకు కేటాయించడం ద్వారా రాబడులు పొందే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ఈక్విటీ డెరివేటివ్స్‌లో హెడ్జ్‌ పొజిషన్ల ద్వారా రాబడులపై అస్థిరతలను తగ్గించడంతోపాటు, కొంచెం అదనపు రాబడులను ఇచ్చే వ్యూహం ఈ పథకంలో గమనించొచ్చు. 43 శాతం పెట్టుబడులను ఈక్విటీ హెడ్జ్‌ పొజిషన్ల కోసం, 24 శాతం పెట్టుబడులను పూర్తిగా ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ రూపంలో నిర్వహిస్తుంటుంది. మల్టీక్యాప్‌ విధానంలో, ఎక్కువగా లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. ఈక్విటీల కోసం చేసిన మొత్తం కేటాయింపుల్లో 83 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉండగా, మిడ్‌క్యాప్‌లో 10 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఉన్నాయి. అస్థిరతల మార్కెట్లలో లార్జ్‌క్యాప్‌ కంపెనీలు కొంచెం స్థిరంగా, సౌకర్యంగా ఉంటాయని తెలిసిందే. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇంధన రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించొచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top