
మారుమూల గ్రామంలో పుట్టిన ఓ టెక్కీ చదువు పూర్తయిన తర్వాత 10 ఏళ్లు ఉద్యోగం చేసి తన 34వ ఏట ఏకంగా రూ.4 కోట్ల కార్పస్ సృష్టించాడు. ఈమేరకు ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుపుతూ రెడ్డిట్‌లో వివరాలు పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ‘ఆర్/నోయిడా’ అనే రెడ్డిట్ కమ్యూనిటీలో వెలసింది. అందులో ‘ఈ రోజు నాకు 34 ఏళ్లు. వ్యక్తిగతంగా నేను రూ.4 కోట్లు పొదుపు చేశాను. ఎలాంటి ఆర్థిక వారసత్వం లేదు. లాటరీలు లేవు. పదేళ్లు నిరంతర కృషి, సహనం, క్రమశిక్షణతో కూడిన జీవనంతోనే ఇది సాధ్యమైంది. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా నాన్న రోజువారీ కూలీ. నిత్యం కుటుంబ పోషణకు సరిపడా మాత్రమే సంపాదించేవాడు. ఆ సమయంలో తాను ఎలాగోలా నాకు కొన్ని పుస్తకాలు కొని, ఎన్నో మంచి విషయాలు పంచుకున్నాడు. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ.. నా వల్ల ప్రజలు మా నాన్నను గుర్తించినరోజే తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఆ వాక్యం నా మనసులోనే ఉండిపోయింది’ అన్నారు.

‘ఆకలి ఎలా ఉంటుందో నాకు ఇంకా గుర్తుంది. నేను అనుకోకుండా కంప్యూటర్‌లోని కొన్ని టెక్నాలజీలను కనుగొన్నాను. నేను వాటితో ప్రేమలో పడ్డాను. నెమ్మదిగా అవి నా చుట్టూ ఉన్న జీవితాన్ని మార్చడం ప్రారంభించాయి. దాంతో టెక్నాలజీ రంగంలో మంచి ఉద్యోగం వచ్చింది. చిత్తశుద్ధితో పనిచేశాను. అనవసర ఖర్చులను తగ్గించాను. తెలివిగా పొదుపు చేశాను. చివరికి పార్ట్ టైమ్‌గా ట్రేడింగ్ ప్రారంభించాను. నాకు గురువు లేడు. నా తప్పుల నుంచి, యూట్యూబ్‌లో ఉచిత కంటెంట్ ద్వారా, కొన్ని పుస్తకాల నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని చెప్పారు.
ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్
ఎందుకు చెబుతున్నారంటే..
‘ఎక్కడో ఒక చిన్న గ్రామంలో లేదా ఏదో పట్టణంలో ఎవరైనా నిస్సహాయతతో ఉండవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వ్యక్తి.. తమ ఇంగ్లిష్ బాగోలేదని నమ్మే వ్యక్తి.. కలలు కేవలం ధనవంతుల కోసమే అనుకునే వ్యక్తులు ఉండవచ్చు. నేను ఆర్థికంగా సాధించగలిగింది.. మీరూ సాధిస్తారు. మీరు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. పెద్ద డిగ్రీలు వద్దు. కానీ, జీవితంగా ఎదగాలంటే పట్టుదల, గెలుస్తామనే తపన, మీపై నమ్మకం ఉండాలి’ అన్నారు.