ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ | ICICI Bank account holders can use Twitter to transfer funds | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ

Jan 20 2015 2:23 AM | Updated on Sep 19 2018 8:41 PM

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ - Sakshi

ట్విట్టర్ ద్వారా ఐసీఐసీఐ నగదు బదిలీ

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ట్విట్టర్ ద్వారా కూడా నగదును బదిలీ చేసుకోవచ్చు.

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు ట్విట్టర్ ద్వారా కూడా నగదును బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చని, ప్రి పెయిడ్ మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్  రాజీవ్ సభర్వాల్ చెప్పారు. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీ చేసుకునే అవకాశాన్నందిస్తున్న తొలి ఆసియా బ్యాంక్ తమదేనని, అలాగే ప్రపంచంలో రెండవదని వివరించారు.

ఈ సౌకర్యాన్ని పొందాలంటే తమ ట్విటర్ హ్యాండిల్‌లో నమోదు చేసుకోవాలని వివరించారు. నగదు బదిలీకి నగదు  పంపించే వ్యక్తి, అవతలి వ్యక్తికి ట్విట్టర్ హ్యాండిల్ తెలిసి ఉండాలని పేర్కొన్నారు. నగదు బదిలీ లావాదేవీ అనంతరం నగదును పంపించిన వ్యక్తికి యూనిక్ కోడ్‌తో కూడిన ఒక ఎస్‌ఎంఎస్ వస్తుందని, నగదు పొందే వ్యక్తి ఈ కోడ్‌ను స్పెషల్ వెబ్‌పేజీలో ఎంటర్ చేయాల్సి ఉంటుందని వివరించారు.

ప్రస్తుతం నగదు బదిలీకి ఎన్‌ఈఎఫ్‌టీ(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్), ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) విధానాలను ఉపయోగిస్తున్నామని, త్వరలో ఐఎంపీఎస్(ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్)లో కూడా చేరతామని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా నగదు బదిలీకి ఎలాంటి చార్జీలు ఉండవని, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. ఒక వేళ డబ్బులు పొందే వ్యక్తి వేరే బ్యాంక్ ఖాతాదారు అయితే, ఆ వేరే బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరిగా కోట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది ఫేస్‌బుక్ ద్వారా నగదు బదిలీ సౌకర్యాన్ని అందించామని చెప్పారు.
 
ట్విట్టర్ ఇండియా బిజనెస్ హెడ్.. తరన్‌జిత్ సింగ్
ట్విట్టర్ ఇండియా బిజినెస్ హెడ్‌గా తరన్‌జిత్ సింగ్ నియమితులయ్యారు. భారత్‌లో ట్విట్టర్‌కు వాణిజ్య పరమైన అవకాశాలను పెంచడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తారని ట్విట్టర్ మేనేజింగ్ డెరైక్టర్ పర్మిందర్ సింగ్ చెప్పారు.

Advertisement
Advertisement