హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామికవేత్తలంతా ఏపీకి రావాలని పలువురు పారిశ్రామికవేత్తలు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న పారిశ్రామికవేత్తలంతా ఏపీకి రావాలని పలువురు పారిశ్రామికవేత్తలు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఫ్యాప్సీలో భాగంగా ఉన్న ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ విడిపోయి ఏపీ శాఖగా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్లో ఉన్న పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిందిగా అక్కడి ఛాంబర్ నాయకులు కోరారు. అలాగే ఛాంబర్ పేరును కూడా.. అసోసియేషన్ బదులు ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌గా పేరు మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఫ్యాఫ్సీ పారిశ్రామికవేత్తలకు వేదికగా ఉండేది. విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి కూడా ఒక సంఘం ఉండాలని భావించి.. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఛాంబర్‌ను ఉత్తరాంధ్ర, సెంట్రల్, రాయలసీమ జోన్లుగా ఏర్పాటు చేసి వాటికి ముగ్గురు ఉపాధ్యక్షులను నియమించారు.
తొలి అధ్యక్షుడిగా మండవ ప్రభాకరరావు
ఈ కొత్త ఫెడరేషన్‌కు నూజివీడు సీడ్స్ అధినేత మండవ ప్రభాకరరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, సెంట్రల్ జోన్ ఉపాధ్యక్షులుగా జేఏ చౌదరి, జి సాంబశివరావు, చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఎన్నుకున్నారు. మరో 30 మంది బోర్డు ఆఫ్ డెరైక్టర్లుగా ఎంపికయ్యారు. ఈ కార్యవర్గం శనివారం విజయవాడ మురళీఫార్చ్యూన్ హోటల్‌లో బాధ్యతలు స్వీకరించి సమావేశమైంది. ఆంధ్రా ఛాంబర్‌కు రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.