కరోనా : 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత

HUL pledges Rs. 100 crore announces price cuts on sanitizers  - Sakshi

కరోనాపై యుద్ధానికి ముందుకొచ్చిన హెచ్‌యూఎల్‌

 2 కోట్ల సబ్బులు ఉచితం,  రూ. 100 కోట్ల సాయం

శానిటైజర్లు, సబ్బులపై 15 శాతం ధరల కోత

సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) కోవిడ్‌ -19 (కరోనా వైరస్‌) వ్యతిరేక పోరాటంలో తన వంతుగా ముందుకు వచ్చింది. భారతదేశంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు  శుక్రవారం ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. వ్యక్తిగత, గృహ పరిశుభ్రతకు ఉపయోగించే ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నామని వెల్లడించింది. ప్రజా ప్రయోజనార్ధం​ ముఖ్యంగా లైఫ్‌బాయ్‌ శానిటైజర్‌, లిక్విడ్ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్‌ల ధరలను  15 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది. తగ్గించిన ఈ ధరల ఉత్పత్తుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తున్నామనీ, ఇవి రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లో లభిస్తాయని  మీడియా ప్రకటనలో తెలిపింది.

అంతేకాదు రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ స‌బ్బుల‌ను ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని హెచ్‌యుఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా తెలిపారు. లైఫ్‌బాయ్ శానిటైజర్స్, లైఫ్‌బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్,  డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్‌ల ఉత్పత్తిని కూడా వేగవంతం చేశామనీ, రాబోయే వారాల్లో దీనిని మరింత పెంచడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తమలాంటి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనీ, ప్రపంచ ఆరోగ్య విపత్తును అధిగమించేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. మ‌రోవైపు స‌బ్బుల త‌యారీకి అవ‌స‌రం అయ్యే ముడిస‌రుకుల ధ‌ర‌లు పెరిగినా స‌బ్బుల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు  పలు సంస్థలు ప్రకటించాయి. ప‌తంజ‌లి, గోద్రెజ్ త‌దిత‌ర సంస్థ‌లు కూడా త‌మ స‌బ్బుల ధ‌ర‌ల‌ను 12.5 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపాయి.

కాగా సరఫరా కంటే డిమాండ్ ఎక్కువ కాడంతో హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్క్‌ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఈ ధరలపై నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం వీటి కొరత నేపథ్యంలో అక్రమాలను నిరోధించేందుకు వీటి ధరలపై ఆంక్షలు విధిస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార,  ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 200 మి.లీ బాటిల్ హ్యాండ్ శానిటైజర్ ధర రూ.100 మించరాదని,  అలాగే సర్జికల్‌మాస్క్‌ల ధరలు, రూ.  8  రూ.10 మించకూడదని ఆయన వెల్లడించారు.  2020 జూన్ 30 వరకు ఈ ధరలను కట్టుబడి ఉండాలని,లేదంటే కఠిన చర్యలు తప్పవని  స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top