‘హిందూ’ వెంచర్ ఫండ్ త్వరలో..

‘హిందూ’ వెంచర్ ఫండ్ త్వరలో..


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔత్సాహిక హిందూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్ ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తుందని ఫోరం వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ చెప్పారు. తొలుత ఈ ఫండ్‌ను భారత్‌లో ప్రారంభిస్తామని, ఆ తర్వాత ఇతర దేశాలకూ విస్తరిస్తామన్నారు.



 ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన విజ్ఞానానంద్ వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం ద్వారా హిందూ పారిశ్రామికవేత్తలను ఒకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. నవంబర్‌లో జరిగే వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం సదస్సు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోరం భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.



వివరాలు ఆయన మాటల్లోనే..

 ఒక వేదిక ద్వారా..

 సంపదను సృష్టించడం, దాన్ని సమంగా పంచడం ద్వారా శ్రేయస్కర సమాజ స్థాపన లక్ష్యంతో వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం పనిచేస్తోంది. ఒక దేశానికో, ప్రాంతానికో ఫోరం కార్యకలాపాలను పరిమితం చేయడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ పారిశ్రామికవేత్తలను ఒక తాటిపైకి తీసుకొస్తున్నాం.  హిందూ పారిశ్రామికవేత్తలు భారత్‌లో ఎంతైతే సంపద సృష్టిస్తున్నారో అంతే మొత్తం దేశం వెలుపలా పెంపొందిస్తున్నారు.



ఉన్నత పదవులూ దక్కించుకుంటున్నారు. ఫోర్బ్స్ జాబితాలోనూ పేర్లు నమోదవుతున్నాయి. మతం అనేది కేవలం ఒక భాగం మాత్రమే. ఆర్థిక సౌభాగ్యం ఉంటేనే సమాజం బాగుంటుంది. మేం తీసుకున్న చొరవకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. హిందూ పారిశ్రామికవేత్తలు చేతులు కలుపుతున్నారు.



 ఫండ్‌కు భారీ నిధులు..

 వీసీ ఫండ్‌కు నిధులు సమకూర్చేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఔత్సాహిక యువతను సొంత వ్యాపారాల వైపు నడిపించాలన్న తపన పెద్ద పెద్ద వ్యాపారుల్లో కనపడుతోంది. దీంతో ఫండ్ విలువ భారీగానే ఉంటుంది. తొలుత భారత్‌లో ప్రారంభిస్తాం. దశలవారీగా ఫండ్‌ను ప్రపంచ దేశాలకు విస్తరిస్తాం. చేతి వృత్తులవారు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలకు వీసీ ఫండ్ ద్వారా వ్యాపారంలో పురోగతి సాధించేలా తోడ్పాటు అందిస్తాం.



ఈ కంపెనీలు ఎంఎన్‌సీలతో పోటీ పడుతూ తక్కువ ధరకు ఉత్పత్తులను అందించాలన్నది మా సంకల్పం. కంపెనీలు బలపడితేనే ఇది సాధ్యపడుతుంది. అత్యుత్తమ ఫలితాలను రాబట్టేలా ఫోరం ముందుకు వెళ్తోంది. భవిష్యత్ అంతా యువతదే. వీరిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహిస్తాం. ప్రపంచీకరణ  నేపథ్యంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో యువతకు వివరిస్తున్నాం.



 మెరుగైన సంబంధాలు..

 ప్రపంచ వాణిజ్యంలో హిందూ పారిశ్రామికవేత్తల వాటా ప్రస్తుతం 5 శాతంలోపే. వెయ్యేళ్ల క్రితం ఇది 49 శాతముండేది. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. 20-25 ఏళ్లలో ఈ వాటాను 16 శాతానికి చేర్చాలన్నది మా లక్ష్యం. ఇందుకు హిందూ పారిశ్రామికవేత్తల అనుసంధానం మాత్రమే ఏకైక పరిష్కారం. ఇందుకోసం వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం నడుం బిగించింది. ప్రవాస భారతీయ కుటుంబాలను పెద్ద ఎత్తున అనుసంధానం చేస్తున్నాం. ఫోరం వేదిక ద్వారా సంస్థల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగ వుతున్నాయి.



 సంయుక్త భాగస్వామ్య కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం చేతులు మారేందుకు వీలవుతోంది. ఈ ఫలితాలూ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. హాంకాంగ్‌లో జరిగిన వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం అంతర్జాతీయ సదస్సుకు కేరళ నుంచి ఇద్దరు యువకులు హాజరయ్యారు. అంతకుముందు వరకు వారిరువురికీ పరిచయం లేదు. వారి వ్యాపార ఆలోచన కాస్తా ఒక ఫండింగ్ కంపెనీకి నచ్చింది. ఇంకేముంది ఆ ఫండ్ అందుకున్న యువకులు స్థాపించిన కంపెనీ ఇప్పుడు రూ.120 కోట్ల టర్నోవర్ స్థాయికి చేరింది. ఇలాంటి విజయగాథలు చాలానే ఉన్నాయి.



 నవంబర్‌లో సదస్సు..

 గతేడాది బ్యాంకాక్‌లో వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరం అంతర్జాతీయ సదస్సుకు 20 దేశాల నుంచి 500కుపైగా హిందూ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. వీరిలో 100 మందికిపైగా బిలియనీర్లే. 2014 నవంబర్ 21-23 తేదీల్లో న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. 40కిపైగా దేశాల నుంచి 1,500 మంది దాకా హిందూ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, బ్యాంకర్లు, వీసీ ఫండ్ కంపెనీల ప్రమోటర్లు పాల్గొం టున్నారు.



భారీ, మధ్యతరహా సంస్థలతో స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీల అనుసంధానం, నిధుల లభ్యత, సాంకేతిక విజ్ఞానం బదిలీ ప్రధానాంశంగా సదస్సు సాగుతుంది. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల తయారీ కంపెనీలు, చేతి వృత్తుల వారిని ప్రముఖంగా ప్రోత్సహిస్తాం. ప్రపంచ స్థాయికి వీరిని తీసుకెళ్లాలన్నదే మా ధ్యేయం. అంతర్జాతీయ సదస్సు ఏర్పాట్లలో భాగంగా వివిధ దేశాల్లో సన్నాహక సదస్సులనూ నిర్వహిస్తున్నాం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top