ఎల్‌ఐసీ చైర్మన్‌గా  భార్గవకు అదనపు బాధ్యతలు 

Govt appoints Hemant Bhargava interim chairman of LIC - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి చైర్మన్‌గా ప్రస్తుత ఎండీ హేమం త్‌ భార్గవ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎల్‌ఐసీ చైర్మన్‌గా వీకే శర్మ డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. హేమంత్‌ భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్‌ఐసీ ఎండీ బాధ్యతల్లో ఉన్నారు.  

చైర్మన్‌ పదవికి ఇంటర్వ్యూలు 
ఎల్‌ఐసీ చైర్మన్, ఎండీ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖ సెక్రటరీ బీపీ శర్మ ఆధ్వర్యంలోని బ్యాంకు బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎండీగా ఉషా సంగ్వాన్‌ పదవీకాలం గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిపోవడంతో ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలుంటారు. చైర్మన్, ఎండీ పదవుల కోసం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు సంబంధిత వర్గాల కథనం. ఎల్‌ఐసీలోనే అధికారుల స్థాయిలో ఉన్న ఎంఆర్‌ కుమార్, హెచ్‌ఎస్‌ శశికుమార్, టీసీ సుశీల్‌ కుమార్‌ (హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌), ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాజ్‌కుమార్‌ తదితరులు రేసులో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఎండీ పదవుల్లో ఉన్న సునీతా శర్మ ఈ ఏడాది మార్చిలో రిటైర్‌ కానున్నారు. అలాగే బి. వేణుగోపాల్‌ మే నెలలో, హేమంత్‌ భార్గవ జూలైలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top