ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు 

Government in talks with US over steel import tariff - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్‌ కుమార్‌ తెలిపారు. సెయిల్‌ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్‌ పరిశ్రమ చాలా ప్రత్యేకమైది. ఈ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుకోవల్సిన అవసరం భారత ప్రభుత్వంపై ఉందని వారికి చెప్పాం. అయితే, చర్చల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.’ అని మీడియాతో చెప్పారాయన. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను విధించటం తెలిసిందే.

ఆర్సెలర్‌ మిట్టల్‌ను వేగం పెంచమన్న సెయిల్‌జేవీ అంశంపై లక్ష్మీ ఎన్‌ మిట్టల్‌కు లేఖ 
హై–ఎండ్‌ ఆటోమోటివ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన జాయింట్‌ వెంచర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఆర్సెలర్‌ మిట్టల్‌ను కోరింది. ఇరు సంస్థలు ఏర్పాటుచేయనున్న ఈ వెంచర్‌కు గతేడాదిలోనే సెయిల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ.. పలు ఆర్థిక అంశాలపై ఇప్పటికీ తుది ఒప్పంద సంతకాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జేవీ ఏర్పాటు వేగవంతం కావాలని, ఒప్పంద సంతకాలను పూర్తి చేయాలని ఆర్సెలర్‌ మిట్టల్‌ సీఈఓ లక్ష్మీ ఎన్‌ మిట్టల్‌కు గురువారం ఒక లేఖ రాసినట్లు సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరి వెల్లడించారు. ‘మిట్టల్‌ సంస్థ జేవీ ఏర్పాటుకు సుముఖంగానే ఉంది. మావైపు నుంచి మేము కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. నిజానికి ఈ నెలలోనే డీల్‌ పూర్తిచేయాలనుకున్నాం. అయితే, మిట్టల్‌ సంస్థ వేగంగా లేనందున వచ్చే నెలలో జేవీ ఒప్పంద తుది సంతకాలను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం.’ అని తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top