అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ

Government allows private sector to participate in all sectors - Sakshi

కేంద్ర కొత్త పీఎస్‌యూ విధానం

కొత్త దివాలా పిటిషన్లకు ఏడాది విరామం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తుది విడత చర్యలు

న్యూఢిల్లీ: కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) గరిష్టంగా నాలుగింటికే పరిమితం చేయనుంది. మిగతావాటన్నింటినీ విలీనం చేయడమో లేదా విక్రయించడమో చేయనుంది.  వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలన్నింటినీ ప్రైవేటీకరించనుంది. ఈ మేరకు కొత్తగా పీఎస్‌యూ విధానాన్ని ప్రకటించింది.  కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు ఉద్దేశించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తుది విడత చర్యల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం వెల్లడించారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీఎస్‌యూలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరమున్న వ్యూహాత్మక రంగాల వివరాలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ రంగాల్లోనూ ప్రైవేట్‌ సంస్థలను అనుమతించినప్పటికీ కనీసం ఒక్క పీఎస్‌యూనైనా కొనసాగిస్తారు. ఇక వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలను సాధ్యాసాధ్యాలను బట్టి తగు సమయంలో ప్రైవేటీకరిస్తామని మంత్రి చెప్పారు. ‘స్వయం సమృద్ధిని సాధించే క్రమంలో దేశానికి సమగ్రమైన విధానం అవసరం.

ఇది దృష్టిలో ఉంచుకునే కొత్త పీఎస్‌యూ విధానంలో అన్ని రంగాల్లోనూ ప్రైవేట్‌ కంపెనీలను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎస్‌యూలు అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న వ్యూహాత్మక రంగాల్లో వాటిని కొనసాగిస్తూనే.. అనవసర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే దిశగా సంఖ్యను మాత్రం కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగింటికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా వాటన్నింటినీ హోల్డింగ్‌ కంపెనీల్లోకి చేర్చడం, విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం జరుగుతుంది’ అని ఆమె వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా 2020–21లో  రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యాన్ని సాధించేందుకూ ఇది తోడ్పడనుంది.  

చిన్న సంస్థలకు ఊరట..
కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో వ్యాపారాలు దెబ్బతిని, రుణాలు కట్టలేకపోయిన చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఊరట దక్కనుంది. దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి సంబంధించి కనీస బాకీల పరిమాణాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ప్రత్యేకంగా దివాలా పరిష్కార మార్గదర్శకాలను కూడా దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్‌ 240ఎ కింద త్వరలో నోటిఫై చేయనున్నట్లు వివరించారు. ఇక, మహమ్మారి వ్యాప్తి పరిస్థితులను బట్టి కొత్త దివాలా పిటిషన్ల దాఖలును ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కరోనాపరమైన రుణాల ఎగవేతలను దివాలా కోడ్‌లో (ఐబీసీ) డిఫాల్ట్‌ పరిధి నుంచి తప్పిస్తూ తగు సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, కంపెనీల చట్టం ప్రకారం సాంకేతికంగాను, ప్రక్రియపరంగాను తప్పనిసరైన నిబంధనల పాటింపు విషయంలో స్వల్ప ఉల్లంఘనలను క్రిమినల్‌ చర్యల పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసు కుంది. కార్పొరేట్‌ సామాజిక కార్యకలాపాల (సీఎస్‌ఆర్‌) వివరాల వెల్లడి లోపాలు, బోర్డు నివేదికల్లో లోటుపాట్లు, ఏజీఎంల నిర్వహణలో జాప్యం వంటి స్వల్ప ఉల్లంఘనలను డిక్రిమినలైజ్‌ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

విదేశాల్లో నేరుగా లిస్టింగ్‌..
లిస్టెడ్, అన్‌లిస్టెడ్‌ కంపెనీలు తమ షేర్లను నేరుగా నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌ చేసుకునేందుకు అనుమతించనున్నట్లు చెప్పారు. దేశీ కంపెనీలకు ఇది భారీ ముందడుగని ఆర్థిక మంత్రి అన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top