బిగ్గెస్ట్ కంపెనీగా గూగుల్
ప్రముఖ టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్ మధ్య హోరా హోరీ పోరులో గూగుల్ పై చాయి సాధించింది.
	శాన్‌ఫ్రాన్సిస్‌కో:  ప్రముఖ టెక్ దిగ్గజాలు  యాపిల్, గూగుల్  మధ్య హోరా హోరీ పోరులో గూగుల్ పై చాయి  సాధించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యాపిల్ సంస్థ ఆదాయం  గురువారం నాటికి రెండేళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది.  కంపెనీ షేర్ల విలువ  భారీగా  నష్టపోవడం ఈ పరిణామానికి దారి తీసింది.   రెండేళ్లలో తొలిసారి గురువారం ట్రేడింగ్‌లో యాపిల్ షేర్లు 90డాలర్లు పడిపోయాయి. దీంతో మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా గూగుల్ టాప్‌లోకి దూసుకు వచ్చేసింది. గురువారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు విలువ ఒక దశలో 89.47 డాలర్లకు పడిపోయింది. చివరకు 90.34 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో యాపిల్ ప్రపంచ అతిపెద్ద కంపెనీ టైటిల్ కోల్పోవాల్సి వచ్చింది.
	
	గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ అధిక ఆదాయంతో ముందు వరుసలో చేరింది. గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం యాపిల్‌కు 494.8 బిలియన్ల డాలర్లు ఉండగా.. గూగుల్‌కు 500 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి యాపిల్  హవా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో షేర్లు కూడా పడిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు షేర్ల విలువ 14 శాతం తగ్గిందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
	దిగ్గజ బహుళజాతి కంపెనీలు రెండూ గురువారం  నష్టాలను చవిచూసినప్పటికీ అల్ఫాబెట్ చాలా తక్కువ అంటే 0.3 శాతం మాత్రమే నష్టపోయిగా, యాపిల్ 2.4 శాతం నష్టాలను మూటకట్టుకుంది. గత 20 సెషన్లుగా  పడిపోతున్న యాపిల్ షేర్లు, గత ఎనిమిది రోజుల నష్టాలతో  సంస్థను భారీగా  నిరాశపర్చాయి. సుమారు 1998 తరువాత  భారీగా నష్టపోయింది.  ఏడు వందల బిలియన్ డాలర్లతో 2015 లో అతి పెద్ద కంపెనీగా అవతరించిన యాపిల్ , తాజాగా అయిదు వందల బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది. అయినా పెట్టుబడిదారుల  మాత్రం యాపిల్ పై నమ్మకాన్ని ఉంచినట్టు  కనిపిస్తోంది.  ఇటీవలి త్రైమాసికంలో  10.52 బిలియన్ల డాలర్ల  విస్తారమైన లాభాలను గడించింది. ఈ నేపథ్యంలో యాపిల్ విస్తారమైన మార్కెట్ ను సమీక్షించుకుని,   సరికొత్తగా వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించుకుని,  లేటెస్ట్  ఉత్పత్తులు, టెక్నాలజీతో  మార్కెట్‌లోకి రావాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
