పట్టాలెక్కిన రియల్టీ

Good days for real estate in the country - Sakshi

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ, వస్తు సేవల పన్నులతో రియల్టీలో పారదర్శకతతో పాటు సానుకూల వాతావరణం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, అమ్మకాల్లోనే కాదు.. పాత ప్రాజెక్ట్‌ల్లోని ఇన్వెంటరీ కూడా క్రమంగా తగ్గుతుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో కొత్త గృహాల ప్రారంభాలు 50 శాతం, అమ్మకాల్లో 24 శాతం వృద్ధి నమోదైంది. ఆకర్షణీయమైన పథకాలు, రాయితీలతో కొన్నేళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ కూడా తగ్గుతుంది. ఈ ఏడాది క్యూ1లో 7.11 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. క్యూ2 నాటికి 2 శాతం తగ్గుదలతో 7 లక్షలకు చేరాయి.  

50,100 కొత్త గృహాలు ప్రారంభం..
ఏడు ప్రధాన నగరాల్లో క్యూ2లో 50,100 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. క్యూ1లో ఇవి 33,400 యూనిట్లుగా ఉన్నాయి. క్యూ2లో ప్రారంభమైన కొత్త యూనిట్లలో 75 శాతం గృహాలు ముంబై, ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణే నగరాల్లోనే ఉన్నాయి. నగరాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. పుణేలో క్యూ1లో 214 యూనిట్లు ప్రారంభం కాగా.. క్యూ2లో 6,900 యూనిట్లు ప్రారంభమయ్యాయి.

ఎన్‌సీఆర్‌లో క్యూ1లో 4,500 యూనిట్ల నుంచి క్యూ2లో 8,500 యూనిట్లు, ముంబైలో 8,600 గృహాల నుంచి 13,600 గృహాలు, బెంగళూరులో 6,850 యూనిట్ల నుంచి 8,800 యూనిట్లు, చెన్నైలో 2,100 యూనిట్ల నుంచి 4,200 యూనిట్లు ప్రారంభమయ్యాయి. కోల్‌కతాలో మాత్రం క్యూ1లో 6,500 యూనిట్లు ప్రారంభం కాగా.. క్యూ2లో 61 శాతం తగ్గుదలతో కేవలం 2,550 యూనిట్లకు పరిమితమయ్యాయి.
 

60,800 గృహాల విక్రయం..
నిజమైన గృహ కొనుగోలుదారులు మార్కెట్‌ వైపు అడుగులు పెడుతున్నారని, పెట్టుబడిదారులు సరైన ప్రాంతం కోసం అన్వేషణ సాగిస్తుండటంతో అమ్మకాలు జోరందుకున్నాయి. ఏడు ప్రధాన నగరాల్లో క్యూ1లో 49 వేల యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికివి 24 శాతం వృద్ధితో 60,800 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తం విక్రయాల్లో 81 శాతం ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లోనే జరిగాయి.

నగరాల వారీగా విక్రయ గణాంకాలను పరిశీలిస్తే.. ఎన్‌సీఆర్‌లో క్యూ1లో 9,100 యూనిట్లు విక్రయం కాగా క్యూ2లో 11,150 అయ్యాయి. ముంబైలో 12,050 నుంచి 15,200, బెంగళూరులో 11,500 నుంచి 14,600, పుణేలో 6,800 నుంచి 8,400, చెన్నైలో 2,320 నుంచి 2,700, కోల్‌కతాలో క్యూ1లో 3,420 యూనిట్లు అమ్ముడుపోగా క్యూ2లో 4 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.

46 శాతం అందుబాటు గృహాలే..
కొత్త గృహాల ప్రారంభాల్లోనైనా, అమ్మ కాల్లోనైనా సరే అఫోర్డబుల్, మిడ్‌ రేంజ్‌ గృహాల ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. క్యూ2లో 50,100 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 38,600 గృహాలు ఈ కేటగిరీలోనివే. ఇందులోనూ రూ.40 లక్షల లోపు ధర ఉన్న గృహాలు 46 శాతం వరకున్నాయి. అఫోర్డబుల్‌ హౌస్‌ విభాగానికి మౌలిక రంగ హోదాతో ఆయా గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆసక్తి చూపిస్తుంటే.. ఎంఐజీ–1, ఎంఐజీ–2 తరగతులకు వడ్డీ రాయితీలతో అమ్మకాలూబాగున్నాయి. – అనూజ్‌ పురీ, చైర్మన్, అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్స్‌

నగరంలో జోరు..
క్యూ2లో హైదరాబాద్‌లో గృహాల ప్రారంభాలు, అమ్మకాలు రెండింట్లోనూ వృద్ధి నమోదైంది. క్యూ1లో 2,650 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. క్యూ2లో 109 శాతం వృద్ధి రేటుతో 5,550 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇక, అమ్మకాల్లో క్యూ1లో 3,800 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2లో 25 శాతం వృద్ధితో 4,750 యూనిట్లు విక్రయమయ్యాయి.

నగరం లో గిడ్డంగి, వాణిజ్య, కార్యాలయాల మార్కెట్లు జోరందుకోవటంతో నివాస సముదాయాలకు గిరాకీ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మెట్రో రైల్‌ అందుబాటులోకి రావటంతో నగరం నలువైపులా గృహాల కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో క్యూ1 నుంచి క్యూ2 నాటికి చెన్నై, కోల్‌కతాల్లో మినహా ఇతర అన్ని నగరాల్లోనూ ధరలు 1 శాతం మేర పెరిగాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top