1,250 లోపునకు పడితే ‘బేర్‌ర్‌...’ | gold rate Reduced the second consecutive week | Sakshi
Sakshi News home page

1,250 లోపునకు పడితే ‘బేర్‌ర్‌...’

Oct 30 2017 2:59 AM | Updated on Oct 30 2017 2:59 AM

gold rate Reduced the second consecutive week

న్యూయార్క్‌/ముంబై: న్యూయార్క్‌ కమోడిటీ మార్కెట్‌లో పసిడి 27వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్‌ (31.1గ్రా) వరుసగా రెండవ వారం తగ్గింది. ఆరు డాలర్లు నష్టపోయి 1,276 డాలర్ల వద్దకు చేరింది. శుక్రవారం ఒకదశలో 1,265 స్థాయికి సైతం పడిపోయినా తరువాత కాస్త కోలుకుంది. ఆరు కరెన్సీలపై ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ భారీగా బలపడటం దీనికి నేపథ్యం.

భారీ తుపానులు సంభవించినప్పటికీ,  అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడవ త్రైమాసికంలో 2.5 శాతం అంచనాలకు మించి 3 శాతంగా నమోదవడం డాలర్‌ ఇండెక్స్‌కు ఉత్సాహాన్ని అందించింది. శుక్రవారం ఒక దశలో 95.06 స్థాయికి సైతం చేరిన డాలర్‌ ఇండెక్స్‌ చివరకు వారం వారీగా 1.05 డాలర్లు బలపడి, 94.72 వద్ద ముగిసింది. నెలా పదిహేను రోజుల్లో పసిడి గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డాలర్‌ ఇండెక్స్‌ కనిష్ట స్థాయి నుంచి ఐదు డాలర్లు  పైకి లేచింది.

ఇంకా ఆశావహ ధోరణి...
పసిడి పతనం అంచున ఉన్నప్పటికీ, ఇంకా ఈ మెటల్‌ బులిష్‌ ధోరణి పట్ల ఆశావహులు ఉండడం గమనార్హం. 1,260 డాలర్లు గట్టి మద్దతుగా వీరు పేర్కొంటున్నారు. 1,250 డాలర్ల లోపునకు పడిపోతేనే బేరిష్‌గా భావించాల్సి ఉంటుందని బ్రోకరేజ్‌ సంస్థ–  బుల్‌ లైన్‌ ఫ్యూచర్స్‌ ప్రెసిడెంట్‌  బిల్‌ బరూచ్‌ విశ్లేషించారు. ఆర్థికాభివృద్ధి, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలను బులియన్‌ ఇప్పటికే ఫ్యాక్టర్‌ చేసుకున్నట్లు పేర్కొన్న ఆయన, ఈ స్థాయిలో పుత్తడి కన్సాలిడేట్‌ అయితే, అది బుల్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని చెప్పారు.

నాలుగువారాల గరిష్ట స్థాయికి చేరిన డాలర్‌ ఇండెక్స్‌కు 96 గట్టి నిరోధమని కూడా ఆయన వాదన. కాగా పసిడికి 1,250 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందని, అంతకులోపు పడిపోతే తాను బేరిష్‌ ధోరణిగా పరిగణిస్తానని శాక్కో బ్యాంక్‌ కమోడిటీ వ్యూహకర్త ఓలీ హాన్‌సేన్‌ పేర్కొన్నారు. పసిడి 1,200 డాలర్లకు పడిపోతే అది కొనుగోళ్లకు అవకాశమని పేర్కొన్న లండన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ రిసెర్చ్‌ హెడ్‌ యాస్‌పర్‌ లారెల్, 1,300 డాలర్ల స్థాయిని దాటలేకపోతున్నందున బేరిష్‌ ధోరణిగానే పరిగణిస్తామని పేర్కొన్నారు.

1,250 డాలర్ల స్థాయిని పసిడి కోల్పోతే 1,200 డాలర్లకు దిగివస్తుందన్నది కూడా ఆయన విశ్లేషణ. మొత్తంమీద అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్, ఈక్విటీ మార్కెట్‌ ధోరణి పసిడి భవితను  సమీప భవిష్యత్తులో నిర్దేశించనున్నాయనేది  పలువురి నిపుణుల విశ్లేషణ.


దేశీయంగా రూ.300కుపైగా డౌన్‌..
27వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశంలో పసిడి కదిలింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజీలో పసిడి వారం వారీగా రూ.236 తగ్గి రూ. 29,318కు చేరింది. ఇక 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.346 తగ్గి రూ. 29,375కు దిగింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పడిపోయి రూ. 29,225కు చేరింది.

ఇక వెండి కేజీ ధర రూ. 951 తగ్గి రూ.38,860కి పడింది. కాగా డాలర్‌పెరిగినా,  దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు, ఈక్విటీల పరుగు నేపథ్యంలో రూపాయి పటిష్ట ధోరణిని ప్రదర్శించింది. వారం వారీగా 0.37 పైసలు బలపడి, 64.88 వద్ద ముగిసింది. లేదంటే దేశంలో పసిడి ధర మరింత పడేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement