డాలర్‌ నడతను బట్టి... పసిడి భవిత!

Gold Down 18 dollars a week - Sakshi

వారంలో 18 డాలర్లు డౌన్‌

ఆర్థిక, భౌతిక ఉద్రిక్తతలు కొనసాగితే 1,400 డాలర్ల దిశగా పయనం!  

బంగారం భవిష్యత్‌ డాలర్‌ ఇండెక్స్‌ భవితపై ఆధారపడి ఉంటుందని ఏంజల్‌ బ్రోకింగ్‌ నాన్‌–అగ్రీ కమోడిటీస్‌ అండ్‌ కరెన్సీస్‌ విభాగం చీఫ్‌ అనలిస్ట్‌ ప్రథమేశ్‌ మాల్యా అభిప్రాయపడ్డారు. మూడు వారాల క్రితం మూడేళ్ల కనిష్ట స్థాయి 88.30కి పతనమైన డాలర్‌ ఇండెక్స్‌ ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిన వారంలో తిరిగి 90.22స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా)కు 1,364 డాలర్ల స్థాయిని చేరిన పసిడి ధర ఫిబ్రవరి 9వ తేదీతో ముగిసిన వారంలో 1,318 డాలర్లకు పడింది.

వారంలో 18 డాలర్లు పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇదే రీతిలో ముందుకు కొనసాగితే పసిడి కొంత కాంతిని కోల్పోయి వచ్చే మూడు నెలల్లో 1,250 డాలర్లకు చేరవచ్చని మాల్యా అంచనావేస్తున్నారు. అయితే డాలర్‌ ఇండెక్స్‌ బేరిష్‌ ట్రెండ్‌ తిరిగి ప్రారంభమయితే, మళ్లీ పసిడి 1,400 డాలర్ల దిశగా పయనించే అవకాశం ఉందని మరికొందరు నిపుణుల అభిప్రాయం.

ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీస్‌సహా మార్కెట్‌లో అన్ని విభాగాలూ  ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. కొంత బేరిష్‌ ట్రెండ్‌వైపునకు మొగ్గు కనిపిస్తున్నా, దీనికి కారణాలు ఇంకా విశ్లేషణ దశలోనే ఉన్నాయి. ఊహించని రీతిలో అంతర్జాతీయంగా మళ్లీ ఏదైనా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తి, దీనికి  భౌగోళిక ఉద్రిక్తతలు కూడా తోడయితే, పసిడి 1,400 డాలర్ల వైపు వేగంగా పురోగమిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

దేశీయ స్పాట్‌ మార్కెట్‌లో రూ.500కు పైగా డౌన్‌
ఇక దేశీయంగా చూస్తే డాలర్‌ మారకంలో రూపాయి విలువ వారంవారీగా 64.23 వద్ద స్థిరంగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడి వారంలో 10 గ్రాములకు రూ. 358 తగ్గి, రూ.30,009కి చేరింది. అనలిస్ట్‌ ప్రథమేశ్‌ మాల్యా అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ పురోగతి కొనసాగితే, దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి వచ్చే మూడు నెలల్లో 28,800కు పడిపోయే అవకాశం ఉంది.  

ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్‌లో ధర 99.9 స్వచ్ఛత ధర రూ.505 నష్టంతో రూ.30,130కు దిగింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో పతనమై రూ. 29,980కి దిగింది. వెండి కేజీ ధర భారీగా 1,350 తగ్గి, రూ. 37,920కి పడింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top