జీఎస్టీ ఎఫెక్ట్‌: 8 ఏళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్‌

Gold demand in India seen falling to 8-year low on GST, PMLA woes - Sakshi

సాక్షి, ముంబై:  బులియన్‌ వ్యాపారంపై ప్రభుత్వం  తీసుకున్న తాజా చర్యలు, గ్రామీణ ప్రాంతాలనుంచి డిమాండ్‌ బాగా తగ్గడంతో 2017లోబంగారం డిమాండ్‌ భారీగా క్షీణించిందని వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్‌ వెల్లడించింది.  జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 24 శాతం తగ్గి 145.9 టన్నులకు చేరిందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో  తెలిపింది.

ప్రపంచంలో చైనా తరువాత రెండవ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఈ ఏడాది గణనీయమైన క్షీణత కన్పించింది. ముఖ్యంగా 845 టన్నుల 10 సంవత్సరాల సగటుతో పోల్చుకుంటే 2017లో డిమాండ్‌ సగటున 650 టన్నులుగా ఉండవచ్చని డబ్ల్యుజిసి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అంచనా వేశారు. 2016లో ఇది 666.1 టన్నులుగా  ఉంది.

సెప్టెంబర్ త్రైమాసికంలో, నూతనంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ), బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు, మనీలాండరింగ్‌ వ్యతిరేక  చట్టాలు బంగారు రీటైల్‌ కొనుగోళ్లను ప్రభావితం చేశాయన్నారు. భారతదేశ బంగారు డిమాండులో మూడింట రెండు వంతుల గ్రామీణ ప్రాంతాలనుంచే లభిస్తుంది. అయితే, ఈ ఏడాది దేశంలోని రుతుపవనాల ప్రభావంతో కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లో ఆదాయాలు పడిపోయాయి. దీంతో రాబోయే త్రైమాసికాల్లో కూడా ఈ ప్రాంతాల్లో ఆభరణాల గిరాకీని ప్రభావితం చేసే అవకాశం ఉందని సోమసుందరం తెలిపారు. 

కాగా, 2017 చివరి త్రైమాసికంలో బంగారం దిగుమతులు నాలుగో వంతు పడిపోతాయని పరిశ్రమల వర్గాలు గతంలోనే అంచనా వేశాయి. ఈక్విటీ మార్కెట్లనుంచి మంచి రిటర్న్స్‌ వస్తుండటంతో చాలామంది ఇన్వెస్టర్లు అటు వైపు మళ్లుతున్నట్టు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top