కీలక నిరోధం దాటిన బంగారం

కీలక నిరోధం దాటిన బంగారం - Sakshi


1300 డాలర్ల పైకి...  

ఏకంగా 34 డాలర్ల లాభం ∙

ఈ ఏడాది పసిడికి ఇదే గరిష్టస్థాయి




అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్‌ ఒడిదుడుకులు, ఫెడ్‌ ఫండ్‌ రేటును ప్రస్తుత 1.00–1.25 శాతం శ్రేణి నుంచి పెంచే అవకాశాలు తక్షణం లేకపోవడం వంటి అంశాలు బంగారానికి బలాన్నిస్తున్నాయి. సెప్టెంబర్‌ 1తో ముగిసిన వారంలో న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర కీలక నిరోధ స్థాయి 1300 డాలర్లను దాటింది. ఈ స్థాయి వద్ద గడచిన రెండు వారాల నుంచీ పసిడికి గట్టి నిరోధం ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వారం చివరిలో ఒకదశలో 1334 డాలర్ల స్థాయిని తాకినప్పటికీ, చివరకు 1,329 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం వారంతో పోలిస్తే పసిడి ఏకంగా 34 డాలర్లు పెరిగింది.



పడితే కొనచ్చు...: అమెరికా ఆర్థిక రంగానికి వెలువడిన పలు సానుకూల, ప్రతికూల గణాంకాల తరహాలోనే డాలర్, పసిడి పరస్పర వ్యతిరేక దిశల్లో వారమంతా ఒడిదుడుకులమయంగా తిరిగాయి. ఒక దశలో డాలర్‌ ఇండెక్స్‌ 93 డాలర్ల స్థాయికి పెరిగితే, పసిడి 1,280 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే వెంటనే డాలర్‌ బలహీనతతో తిరిగి పసిడి భారీగా పైకెగసి, కీలక 1,300 డాలర్ల నిరోధాన్ని అధిగమించింది. వారం ముగిసేసరికి డాలర్‌ ఇండెక్స్‌ 92.82 డాలర్ల స్థాయిలో ఉంది. అంతక్రితం వారంకన్నా పెరిగినా, మున్ముందు డాలర్‌ బలహీనత ఖాయమని, ఇది పసిడి బులిష్‌కు సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు.



 పసిడికి దిగువస్థాయిలో 1300 డాలర్లు, 1280 డాలర్లు తక్షణ నిరోధాలన్నది వారి అంచనా. 1400 డాలర్లు చేరడానికి 1340, 1375 డాలర్లు నిరోధంగా టెక్నికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, సమీప కాలంలో పసిడి దూకుడు కొనసాగుతుందని అంచనావేస్తున్నారు. అయితే ప్రస్తుత  స్థాయి నుంచి 70 డాలర్ల వరకూ లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందనీ, అలా జరిగితే అది కొనుగోళ్లకు అవకాశమని కూడా నిపుణుల అంచనా.



దేశీయంగా రూ. 845 అప్‌

వారం వారీగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ దాదాపు అక్కడక్కడే (63.85) ఉండడం, నైమెక్స్‌లో బంగారం పరుగు పెట్టడం వంటి అంశాలు దేశీయంగా పసిడిపై కూడా భారీగా ప్రభావం చూపించాయి. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో  రూ.656 పెరిగి రూ. రూ.29,823కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 ఎగసి, రూ.29,905కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 29,755కు పెరిగింది. ఇక వెండి కేజీ ధర కూడా భారీగా రూ.1,245 ఎగసి రూ.39,995 కి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top