విదేశీ దిగుమతుల తగ్గింపే లక్ష్యం

The goal is to reduce foreign imports - Sakshi

‘ఓఎన్‌జీసీ విదేశ్‌’ డైరెక్టర్‌ పీకే రావు

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు విదేశాల నుంచి ఆయిల్‌ దిగుమతిని 10 శాతం తగ్గించటమే లక్ష్యంగా ఓఎన్‌జీసీ పని చేస్తోందని దాని అనుబంధ విభాగం ఓఎన్‌జీసీ విదేశ్‌ డైరెక్టర్‌ పి.కె.రావు చెప్పారు. విదేశాల్లో సంస్థ కార్యకలాపాలు విజయవంతంగా సాగిస్తున్నట్లు చెప్పారాయన. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అసెట్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2002 నుంచి ఓఎన్‌జీసీ వివిధ దేశాల కంపెనీలతో కలసి సంయుక్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 20 దేశాల్లో 41 ప్రాజెక్టులు చేపట్టాం. రష్యాలోని వెల్‌లో మైనస్‌ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్స్‌ చేపడుతున్నాం.

కొలంబియాలో 3200 బ్యారల్స్‌ ఉత్పిత్తి చేయగల బావిని సొంతంగా తవ్వాం’’ అని వివరించారు. ప్రస్తుతం తమ చమురు ఉత్పత్తి సామర్థ్యం 14.1 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుందని, దీన్ని 2030 నాటికి 60 ఎంఎంటీకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారాయన. సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల నుంచి మన వాటాగా 26 శాతం వస్తోందని చెప్పారు. సమావేశంలో ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డీఎంఆర్‌ శేఖర్, గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కె.పాండే, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ అధికారి ఎం.డి.జమీల్‌ తదితరులు పాల్నొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top