ఆన్‌లైన్‌లో అక్షయ పాత్ర! | Food Delivery Services Hikes in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో అక్షయ పాత్ర!

Apr 16 2019 7:41 AM | Updated on Apr 16 2019 7:41 AM

Food Delivery Services Hikes in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉరుకులు పరుగుల నగర జీవనంలో తమకు నచ్చే దైనందిన ఆహారాన్ని తామే తయారు చేసుకొని తినే వెసులుబాటు ఏ కొద్ది మందికో ఉంటుంది. రోడ్డు పక్కన టిఫిన్, హోటల్‌లో మధ్యాహ్న భోజనం, రాత్రి ఆలస్యమైందని కర్రీ పాయింట్లలో కూరలు తీసుకుని వచ్చి కాస్త నింపాదిగా తినే సమయం కూడా ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారి తిప్పలు వర్ణనాతీతం. ఇలాంటి వారికి కోరుకున్న రుచులను, కోరుకున్న చోటికే కావాల్సిన సమయానికే అందిస్తూ ఆదరణ పొందుతున్నాయి ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థలు, యాప్‌లు. ఇవి ఆహార శాలల్ని ప్రజలకు మరింత చేరువ చేశాయి. క్లిక్‌ చేస్తే చాలు పది నిమిషాల్లోనే కోరుకున్న చోటికి ఆహారం సరఫరా చేస్తున్నాయి. చిన్నస్థాయి నుంచి పెద్ద హోటళ్ల వరకు అన్నీ టేక్‌ అవే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయంటే.. ఆహార పదార్థాల సరఫరాకు ఎంత డిమాండ్‌ ఉందో తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి నెలా దాదాపు 15 లక్షలకుపైగా యాప్, ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఉంటున్నాయి. ఏడాది కాలంలో బుకింగ్‌లు దాదాపు పది రెట్లు పెరిగాయి. స్విగ్గీ, జోమాటో, ఫుడ్‌పాండా తదితర సంస్థలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతోంది.

టిఫిన్ల నుంచి భోజనం వరకు..
ఉదయం లేచిన వెంటనే కావాల్సిన అల్పాహారం ఇంటికే తెప్పించుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లేవారు, అనారోగ్య సమయంలో వంటచేసే పరిస్థితులు లేనపుడు ఈ యాప్‌ సేవలపై ఆధారపడుతున్నారు. ఆహార సరఫరా సంస్థల గణాంకాల ప్రకారం ఉదయం అల్పాహార బుకింగ్‌లు ఎక్కువగా కార్యాలయాలకు ఉంటున్నాయి. రుచి, సేవలు, నాణ్యతపై ప్రజల నుంచి సమాచారం తీసుకుంటున్నాయి. ఆ మేరకు రేటింగ్‌ ఇవ్వడం ద్వారా ప్రజలు ఆహార నాణ్యతపై స్పష్టతకు వస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలతో పాటు రాత్రి భోజనాల కోసం వస్తున్న ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. రాత్రిళ్లు రద్దీ ఎక్కువగా ఉంటోంది. మిడ్‌నైట్‌ బిర్యానీ కోసం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకూ సేవలు అందిస్తున్నాయి. మొబైల్‌ యాప్‌ల్లో ఆహారాన్ని బుక్‌చేసేవారు 90శాతం వరకు ఉంటున్నారు.

నోరూరిస్తున్న బిర్యానీ..  
ఇంటి వద్దకే భోజనం డిమాండ్‌లో చికెన్‌ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. మొబైల్‌ ఆధారిత యాప్‌ల బుకింగ్‌లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైంది. చికెన్‌ 65, కబాబ్, పలావ్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి హైదరాబాదీలతో పాటు తెలుగేతర ప్రజలూ ఎక్కువగా ఈ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసేటపుడు శాకాహారానితో పోలిస్తే మాంసాహారానికి అధిక డిమాండ్‌ ఉంటోందని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. యాప్‌ ఆధారిత ఆహార సరఫరా వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైంది. ప్రతి 3 నెలలకోసారి కనీసం సగటున 15శాతం చొప్పున పెరుగుతోంది. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 3 వేల రెస్టారెంట్లు స్విగ్గీ, ఫుడ్‌పాండా, జోమాటో లాంటి సంస్థలతో వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. పేరున్న హోటళ్లు టేక్‌అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.  

స్వయంగా ఏజెంట్లను నియమించుకుని..
ఇంటి వద్దకే ఆహార సరఫరా (డోర్‌ డెలివరీ) అన్ని రెస్టారెంట్లకూ విస్తరిస్తోంది. ఆహార సరఫరా సంస్థల్లో పార్ట్‌టైమ్, పూర్తిస్థాయి ఏజెంట్లుగా పనిచేసేందుకు యువత ముందుకు వస్తోంది. చదువుకుంటూ పనిచేస్తూ కొందరు ఉపాధి పొందుతున్నారు. సగటున 18 నుంచి 30 ఏళ్లలోపు యువత ఈ రంగంలో పనిచేస్తోంది. 18 ఏళ్ల వయసు, సొంత వాహనం, చెల్లుబాటయ్యే డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్‌సీ పరిశీలించి, ఇంటర్వ్యూలు చేసి ఆన్‌లైన్‌ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. కొన్నిసంస్థలు మహిళలనూ డెలివరీ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని కంపెనీలు ఒక్కో ఆర్డరుకు గరిష్టంగా రూ.120 వరకు డెలివరీ బాయ్స్‌కి చెల్లిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement