ప్రణాళికతోనే ప్రశాంతత

Financial planning in conjunction with a spouse - Sakshi

జీవిత భాగస్వామితో కలసి ఆర్థిక ప్రణాళిక

అన్ని ముఖ్య విషయాలు పంచుకోవాలి

తప్పనిసరిగా అన్నింటికీ నామినీ రిజిస్ట్రేషన్‌

జీవిత భాగస్వామిని నామినీగా పేర్కొంటే బెటర్‌

అనుకోనిది జరిగితే సమస్యల్లేకుండా చూసుకోవచ్చు

భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో ఆదుకునే వైద్య బీమా.. ఇలా ప్రతీ ఒక్క ఆర్థిక విషయాన్ని జీవిత భాగస్వామితో పంచుకోవడం అవసరమే కాదు.. ఎంతో ప్రయోజనం కూడా.

భవిష్యత్తులో ఎవరికైనా ఊహించని పరిస్థితి ఎదురైతే అప్పుడు అయోమయానికి గురి కాకుండా సరైన దిశగా అడుగులు వేసేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం తప్పకుండా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడుల విషయాలను తప్పకుండా చర్చించి నిర్ణయించాలి. డాక్యుమెంట్లు ఎక్కడ పెడుతున్నది, ముఖ్యమైన బ్యాంకు ఖాతాలు, వాటి నామినీ వివరాలు, బీమా పాలసీలు ఇవన్నీ దంపతుల్లో ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఆ అవసరాన్ని ఇక్కడి ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి...

అనురాగ్‌ వయసు 40 ఏళ్లే. ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. ఎదుటివారిని నవ్వుతూ విష్‌ చేస్తాడు. తన కెరీర్‌ పరంగా ఎంతో పని భారం మోస్తున్నా కానీ ఎప్పుడూ అది ముఖంపై కనిపించదు. ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, అవసరంలో ఉన్న వారికి సాయం చేసే తత్వం. కానీ, దురదృష్టం.. ఒకరోజు గుండెపోటుతో అకస్మాత్తుగా తన వారందరినీ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అనురాగ్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, 11 ఏళ్లు, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబం అంతటికీ అతడొక్కడే ఏకైక ఆధారం. అనురాగ్‌ భార్య అవంతిక బాగా చదువుకున్న మహిళ. పూర్తి స్థాయి ఉద్యోగానికి వెళ్లాలా లేక పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం ఎంచుకోవాలా? అన్న సంశయంతో, ఆఖరుకు పార్ట్‌టైమ్‌ ఎంచుకుంది. తన పిల్లల కోసం కొంత సమయం వెచ్చించాలన్నది ఆమె కోరిక. తానే వారిని స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని, వారి ఎదుగుదలను కళ్లారా చూడాలని, అందులో ఉన్న ఆనందాన్ని కోల్పోకూడదన్నది ఆమె అభిప్రాయం. అప్పటికే అనురాగ్‌ తన కష్టార్జితంతో కుటుంబాన్ని కాస్త మంచి స్థితిలో ఉంచిపోవడంతో, అవంతిక ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు సులభంగా జరిగాయి.  
   
వైద్యనాథన్‌ (44) ఓ కంపెనీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌. ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు. దీంతో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడుల కోసం వెచ్చించే తీరిక కూడా లేదు అతనికి. దీంతో పెట్టుబడులను పరిశీలిస్తే అంతా అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. తన సన్నిహితుల సలహాలపై ఆధారపడతాడు. అందు వల్లే వైద్యనాథన్‌ పొదుపులో అధిక భాగం బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలోనే ఉంటుంది. వాటిపై రాబడులు 3.5 శాతమే. పైగా పలు ఎండోమెంట్‌ పాలసీలను కూడా తీసుకున్నాడు. వీటిపైనా దీర్ఘకాలంలో రాబడులు 5–6 శాతం మించవు. కాకపోతే పదేళ్ల క్రితం చేసిన రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి మాత్రం అతడికి బాగా కలిసొచ్చింది.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో రుణం తీసుకుని రియల్‌ ఎస్టేట్‌పై పెట్టుబడి పెట్టాడు. కానీ, ముందు చూసిన ఫలితం అతడికి రెండో పెట్టుబడిలో కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చట్టం (రెరా)ను తీసుకురావడంతో నల్లధన లావాదేవీలు తగ్గిపోయాయి. ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌లో డిమాండ్‌ తగ్గి ధరలపై ప్రభావం పడింది. కాకపోతే తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో వైద్యనాథన్‌కు ఓ ఇల్లు, మరో చోట ఇంకొక ఇల్లుతోపాటు ప్లాట్‌ కూడా ఉన్నాయి. మరోవైపు ఈక్విటీల్లో పెట్టుబడులు నేరుగా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాడు. అవన్నీ గతంలో మంచి పనితీరు చూపించినవి. కానీ, క్రితం ఐదేళ్లలో వాటి పనితీరు చెప్పుకోతగ్గంత లేదు. అనురాగ్‌ మాదిరే ఉన్నట్టుండి వైద్యనాథన్‌ కూడా ఆకస్మిక మరణానికి గురయ్యాడు. కానీ, ఇక్కడ పరిస్థితి భిన్నం.

ఆస్తుల వివరాలు...
వైద్య నాథన్‌ భార్య శ్రీనిధి ముందున్న పెద్ద టాస్క్‌.. అసలు ఆస్తులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు వాటి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో గుర్తించాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆమెకు పెద్దగా తెలియదు. వైద్యనాథన్‌ తనంతట తానే నిర్ణయాలను అమలు చేసేవాడు. పలు సందర్భాల్లో తన భార్యకు తెలియజేసేందుకు వైద్యనాథన్‌ ప్రయత్నించినా ఎందుకోగానీ అది వాయిదా పడింది. కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు, ఫిజికల్‌ లేదా డిజిటల్‌ డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ శ్రీనిధికి తెలియదు. దీంతో అయోమయ పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వివరాలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

వైద్యనాథన్‌ బ్యాంకు ఖాతాలో నమోదై ఉన్న ఈ మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు ఆమెకు తెలియవు. ఇంట్లో డాక్యుమెంట్లను గుర్తించే పనిలో పడింది. బ్యాంకు శాఖకు చెందిన రిలేషన్‌షిప్‌ మేనేజర్, భర్త స్నేహితులను సంప్రదించడం ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. కానీ, అప్పటికీ పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో, ఒక ప్రైవేటు బ్యాంకులో భర్తకు ఖాతా ఉంది. ప్రైవేటు బ్యాంకు ఖాతాకు నామినీగా భార్య శ్రీనిధి పేరే రిజిస్టర్‌ అయి ఉంది. కానీ, ప్రభుత్వరంగ బ్యాంకు ఖాతాలో ఆమె పేరును నామినీగా నమోదు చేసి లేదు. ఎందుకంటే ఆ ఖాతా తెరిచి చాలా కాలం అయింది. పైగా వైద్యనాథన్‌ ఎటువంటి విల్లు రాయలేదు. దీంతో ఖాతాలోని బ్యాలన్స్‌ సరైన లబ్ధిదారునకు చేరేలా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకు మరిన్ని డాక్యుమెంట్లను అడిగింది. 

  వైద్యనాథన్‌ తన వివాహానికి పూర్వమే రూ.50 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుని ఒక మంచి పని చేశాడు. అప్పట్లో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, చాలా ఏళ్లు గడిచిపోవడంతో ద్రవ్యోల్బణం ఈ విలువను తగ్గించి వేసింది. పాలసీ తీసుకున్న సమయంలో నామినీగా తండ్రి పేరును చేర్చాడు. వివాహం అయిన తర్వాత ఆ స్థానంలో భార్య పేరును రిజిస్టర్‌ చేయడాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఆమె అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని, తన మామయ్యను వెంట పెట్టుకుని ఎన్నో సార్లు బీమా కార్యాలయం చుట్టూ క్లెయిమ్‌ కోసం తిరగాల్సి వచ్చింది. ఇక పనిచేస్తున్న సంస్థ తరఫున వైద్యనాథన్‌ కుటుంబానికి మంచి వైద్య బీమా కవరేజీ ఉండేది. అది కాకుండా విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవాలని వైద్యనాథన్‌ అనుకున్నా కానీ ఆ పని చేయలేదు.

దాంతో వైద్యనాథన్‌ మరణం వల్ల ఇప్పుడు కుటుంబానికి వైద్యబీమా కవరేజీ లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఉన్న పాలసీని మరో బీమా సంస్థకు పోర్ట్‌ పెట్టుకునేందుకు శ్రీనిధి ప్రయత్నాలు ఆరంభించింది. ఇక ఈపీఎఫ్‌ సభ్యుడు కావడంతో వైద్యనాథన్‌కు ఎంప్లాయీ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ కూడా ఉంది. కంపెనీని సంప్రదించడంతో ఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునే విషయంలో శ్రీనిధికి సహకారం లభించింది. కానీ, వైద్యనాథన్‌ మరణించే నాటికి అతని ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.9 లక్షలు బ్యాలన్స్‌ ఉంది. అదే సమయంలో నామినీగా శ్రీనిధి పేరు అప్‌డేట్‌ అయి లేదు. బ్యాలన్స్‌ రూ.లక్ష మించి ఉండడంతో తన హక్కులను నిరూపించుకునేందుకు గాను శ్రీనిధి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడం తప్పనిసరి అయింది. కానీ, దీనికి చాలా సమయంతోపాటు, శ్రమ కూడా అవసరమే.

రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు
వైద్యనాథన్‌ రియల్‌ ఎస్టేట్‌లో తొలి ప్రయత్నం ఇచ్చిన విజయంతో ఐదేళ్ల క్రితం మరిన్ని పెట్టుబడులు పెట్టాడు. వాటి విలువ పెరగకపోగా, 20% తగ్గిపోయింది. ప్లాట్‌ ఒకటి ఉండడంతో కబ్జా భయంతో వెంటనే దాన్ని విక్రయించాలన్నది శ్రీనిధి ఆలోచన. మరో పట్టణంలో రెండో ఇంటిని కొనుగోలు చేయగా, దానిపై అద్దె ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో మంచి కిరాయిదారులు రావడం కష్టంగా మారడంతో ఏడాదిలో రెండు నెలలు ఖాళీగా ఉంటోంది. కిరాయి కూడా ఆస్తి విలువలో 2–3% మించి ఉండడం లేదు. దీంతో ఆ ఇంటిని కూడా వెంటనే విక్రయించేసి వచ్చే డబ్బులను లిక్విడ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంది. ఆర్థిక, భావోద్వేగ పరంగా ఎంతో మద్దతుగా నిలిచి, కుటుంబం కోసం ఎంతో శ్రద్ధ చూపించిన భర్త ఆమెకు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఒకవేళ భర్తతో కలసి సమష్టిగా ఆర్థిక విషయాలు చర్చించి ప్రణాళికలను అమలు చేసి ఉంటే నేడు శ్రీనిధి ఇన్ని ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. సమగ్రమైన జీవిత బీమాతోపాటు, కంపెనీకి వెలుపల సొంతంగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీ తీసుకుని ఉంటే ఆ ప్రయోజనాలు కొనసాగి ఉండేవి. అలాగే, సమయానికి లిక్విడిటీ అందుబాటులో ఉండని రియల్‌ ఎస్టేట్‌పైనా ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుని ఉండాల్సింది. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా స్టాక్స్‌లోనూ వైవిధ్యానికి అవకాశం ఉండేది. అలాగే, జాయింట్‌ అకౌంట్లు, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా నామీని రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉంటే శ్రీనిధి పని మరింత సులభం అయ్యేది. ఆస్తులు కూడా ఆమె పేరిట సులభంగా బదిలీ అయ్యేవి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top