
బీమా పాలసీలపై వస్తు, సేవల పన్నును (జీఎస్‌టీ) మినహాయించేందుకు రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం (జీవోఎం) ఆమోదం తెలపడంతో.. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
కమీషన్, రీ ఇన్సూరెన్స్‌లకు సైతం మినహాయింపు లభిస్తుందని.. దీంతో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) నిలిపివేయడం అన్న సమస్య ఎదురుకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్లాన్లపై 18 శాతం రేటు అమలవుతోంది. దీన్ని పూర్తిగా మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి జీఎస్‌టీ మంత్రుల బృందం సైతం ఆమోదం తెలిపి జీఎస్‌టీ కౌన్సిల్‌కు నివేదించింది.
18% తగ్గకపోవచ్చు..
బీమా పాలసీలపై జీఎస్‌టీని మినహాయించినా గానీ, తగ్గింపు అన్నది 18 శాతంగా ఉండకపోవచ్చని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కమీషన్లు, ఆఫీస్ అద్దెలు, సాఫ్ట్‌వేర్ తదితర వాటిపై తాము చెల్లించిన జీఎస్‌టీని కంపెనీలు తిరిగి క్లెయిమ్ చేసుకోలేవని చెప్పారు.
దీంతో కంపెనీలపై పడే ఇన్‌పుట్ ట్యాక్స్ ఆధారంగా నికర తగ్గింపు ఆధారపడి ఉంటుందని వివరించారు. జీఎస్‌టీ మినహాయింపు కన్నా సున్నా రేటు కింద పరిగణిస్తే, అప్పుడు కంపెనీలు తమ ఇన్‌పుట్ వ్యయాలపై చెల్లించిన జీఎస్‌టీని తిరిగి క్లెయిమ్ చేసుకోగలవన్నారు. అలాంటప్పుడు బీమా పాలసీలపై తగ్గింపు 18 శాతంగా ఉండొచ్చన్నారు.