
దేశంలో మొత్తం 56.04 కోట్ల ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలలో 23 శాతం అకౌంట్స్ నిరుపయోగంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి 'పంకజ్ చౌదరి' వెల్లడించారు. 2025 జూలై 31 చివరి నాటికి 56.03 కోట్ల PMJDY ఖాతాలలో 13.04 కోట్లు నిరుపయోగంగా ఉన్నయని లోక్‌సభలో స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 2.75 కోట్ల జన్ ధన్ ఖాతాలు పనిచేయడం లేదని.. ఆ తరువాత జాబితాలో బీహార్ (1.39 కోట్ల ఖాతాలు), మధ్యప్రదేశ్ (1.07 కోట్ల ఖాతాలు) ఉన్నాయని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 18 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. ఒక పొదుపు ఖాతాలో రెండు సంవత్సరాలకు పైగా లావాదేవీలు జరగకపోతే దానిని పనిచేయని ఖాతాగా పరిగణించాలి.
బ్యాంకులలో లావాదేవీలు జరగని లేదా ఇనాక్టివ్ ఖాతాల గురించి ఖాతాదారులకు లేఖలు లేదా ఈమెయిల్స్ ద్వారా తెలియజేయనున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. మొత్తం మీద ఈ ఖాతాలను మళ్ళీ యాక్టివ్ ఖాతాలుగా మార్చి.. ప్రజలు ఉపయోగించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)
ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ పదేళ్ల కిందట కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఇల్లు చాలానే ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరుతో ఓ పథకం లాంచ్ చేశారు.
ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు కేవలం డబ్బు పొదుపు చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందటానికి ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది జీరో అకౌంట్. ఈ ఖాతా ద్వారా సులభంగా లోన్స్ పొందవచ్చు. అయితే చాలామంది ఈ ఖాతాల ద్వారా లావాదేవీలను జరపకపోవడంతో.. అకౌంట్స్ నిరుపయోగంగా మారాయి. వీటిని రీకేవైసీ ద్వారా మళ్ళీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది.