
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ఖాతాల సంఖ్య ఆగస్టు 13 నాటికి 56.16 కోట్లకు చేరింది. ఇందులో రూ.2.68 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. 2015 మార్చి నాటికి ఈ ఖాతాల సంఖ్య 14.72 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 11 ఏళ్లలో గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. జన్‌ధన్ ఖాతాదారుల్లో 56 శాతం మహిళలేనని.. 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల్లో తెరిచినట్టు వెల్లడించింది.
లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో రూ.45 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. జన్‌ధన్ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే డెబిట్ కార్డులు మంజూరైనట్టు వెల్లడించింది.
దేశంలో 94 శాతం వయోజనులకు బ్యాంక్ ఖాతాలున్నట్టు తెలిపింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న సంకల్పంతో కేంద్ర సర్కారు 2014 ఆగస్ట్ 28న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. దీనికంద సున్నా బ్యాలన్స్, ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రమాద బీమా తదితర సదుపాయాలతో సేవింగ్స్ ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం కల్పించింది.