
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ గత జూన్ నెలలో భారత్‌లో భారీ సంఖ్యలో అకౌంట్లను బ్యాన్ చేసింది. దుర్వినియోగం, హానికరమైన కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా జూన్ నెలలో భారత్‌లో 98 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 19.79 లక్షల ఖాతాలను యూజర్ల ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేసింది.
వాట్సాప్‌లో అనుమానాస్పద, హానికరమైన ఖాతాలపై యూజర్ల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో భాగంగా వాట్సాప్ కు భారత్ లోని యూజర్ల నుంచి 23,596 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి 1,001 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని ఖాతాలను నిషేధించడం, తప్పుగా నిషేధించిన మరికొన్నింటిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. వీటిలో 16,069 ఫిర్యాదులు నిషేధ అప్పీళ్లకు సంబంధించినవే కావడం గమనార్హం. ఫలితంగా 756 ఖాతాలపై చర్యలు తీసుకున్నారు. ఇతర ఫిర్యాదులు ఖాతా మద్దతు, ఉత్పత్తి సంబంధిత సమస్యలు, భద్రతా సమస్యల గురించి ఉన్నాయి.
ఖాతా క్రియేట్ చేసినప్పుడు, మెసేజ్‌లు పంపుతున్నప్పుడు, యూజర్ రిపోర్టులు లేదా బ్లాక్స్ వంటి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు మూడు దశల్లో దుర్వినియోగాన్ని గుర్తిస్తామని వాట్సాప్ వివరించింది. నివారణ తమ ప్రాథమిక దృష్టి అని కంపెనీ తెలిపింది. ఎందుకంటే హానికరమైన చర్యను తరువాత గుర్తించడం కంటే అది జరగడానికి ముందు ఆపడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దుర్వినియోగం, తప్పుడు సమాచారం, భద్రతా ముప్పులతో పోరాడటానికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, భద్రతా సాధనాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది.