Jan Dhan Yojana: రూ.1.46 లక్షల కోట్ల డిపాజిట్లు..43 కోట్ల ఖాతాలు

Pradhan Mantri Jan Dhan Yojana Total Deposits Over Rs.1.46 Lakh Crore - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు శనివారం కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. 

సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు. 2014లో ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47% అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 66.69% అంటే 28.70 కోట్ల ఖాతాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారివేనని ఆర్థిక శాఖ పేర్కొంది. 43.04 కోట్ల ఖాతాల్లో 85.6% అంటే, 36.86 కోట్ల ఖాతాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో సరాసరి డిపాజిట్‌ మొత్తం రూ.3,398గా ఉంది.

అంతేకాదు, ఈ ఖాతాల్లో సరాసరి డిపాజిట్‌ మొత్తం పెరుగుతూ వస్తోందనీ, దీనర్థం వీటిని ప్రజలు వినియోగించుకుంటున్నారనీ, వారిలో పొదుపు అలవాటైందని ఆర్థిక శాఖ వివరించింది. ఈ అకౌంట్లు కలిగిన వారికి ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ఇందుకోసం 31.23 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు తెలిపింది. జన్‌ధన్‌ యోజన అమలుతో దేశం అభివృద్ధి పథం ఒక్కసారిగా మారిపోయిందని పీఎంజేడీఐ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పారదర్శకతను పెంచిన ఈ పథకంతో కోట్లాదిమంది భారతీయులకు సాధికారిత, ఆర్థికపరమైన గౌరవం దక్కాయని తెలిపారు.

చదవండి : నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top