అన్ని ఎస్‌ఎంఎస్‌లు ఇక రావా? ఆర్బీఐని ఆశ్రయించిన బ్యాంకులు | Banks ask RBI to stop SMS alert mandate for transactions under Rs 100 why | Sakshi
Sakshi News home page

అన్ని ఎస్‌ఎంఎస్‌లు ఇక రావా? ఆర్బీఐని ఆశ్రయించిన బ్యాంకులు

Oct 13 2025 7:18 PM | Updated on Oct 13 2025 7:37 PM

Banks ask RBI to stop SMS alert mandate for transactions under Rs 100 why

కొన్ని ఆన్‌లైన్‌ లావాదేవీలకు (Digital transactions) సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ సందేశాలను (SMS Alerts) వినియోగదారులకు పంపడాన్ని బ్యాంకులు భవిష్యత్తులో నిలిపేయవచ్చు. రూ.100 లోపు లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్టులు పంపడాన్ని నిలిపివేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ బ్యాంకులు ఆర్బీఐ (RBI) ని ఆశ్రయించాయి.

ఆన్ లైన్‌లో ముఖ్యంగా యూపీఐ ద్వారా పదీ.. ఇరవై.. ఇలా చిల్లర పేమెంట్లు పెరిగిపోయాయి. వీటికి సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ నోటిఫికేషన్లు వినియోగదారులను ముంచెత్తుతున్నాయి. దీంతో అలర్ట్‌ వ్యవస్థ మందగమనానికి దారితీసిందని, దీంతో కొన్నిసార్లు, కస్టమర్లు పెద్ద లావాదేవీలకు సంబంధించిన సందేశాలను కూడా కోల్పోతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. 
 
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో అంతర్గత సంప్రదింపులు జరిపిన తరువాత గత నెలలో ఆర్బీఐకి ఈ విజ్ఞప్తి చేశామని ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎస్‌ఎంఎస్‌లు నిలిపేసిన పక్షంలో ప్రతిపాదిత ప్రత్యామ్నాయ రక్షణలు ఇంకా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉందని మరొక బ్యాంకింగ్ అధికారి తెలిపారు. ఒక వేళ రూ.100 పరిమితి ఉన్న తక్కువ విలువ లావాదేవీల అలర్టులు కావాలంటే ఎస్‌ఎంఎస్‌లు కాకుండా బ్యాంకింగ్ యాప్‌లు లేదా ఈమెయిల్స్ లో నోటిఫికేషన్ల ద్వారా వాటిని పొందవచ్చని వివరించారు.

ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్డుల కోసం కస్టమర్లతో నుంచి నమోదు చేయించుకోవాలి. అయితే ఈమెయిల్ అలర్టులు ఐచ్ఛికం. అంటే ఎస్‌ఎంఎస్‌లు ఆటోమేటిక్‌గా వెళ్తాయి. కానీ ఈమెయిల్ అలర్ట్ లు ఎంచుకున్న వారికి మాత్రమే వెళతాయి.

ఒక్క ఎస్ఎంఎస్ పంపడానికి సుమారు 20 పైసలు ఖర్చవుతుంది. ఇది సాధారణంగా వినియోగదారుల మీదే పడుతుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ఈ ఖర్చును తామే భరిస్తున్నాయి. అదే ఈమెయిల్ అలర్టులకు అయితే పెద్దగా ఖర్చు ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement