ఫేస్‌బుక్‌కు దిగ్గజ కంపెనీల దెబ్బ | Facebook share down on Unilever, Verizon ads freeze | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌కు దిగ్గజ కంపెనీల దెబ్బ

Jun 27 2020 12:17 PM | Updated on Jun 27 2020 1:53 PM

Facebook share down on Unilever, Verizon ads freeze - Sakshi

వివాదాస్పద సందేశాలు, రాతల(హేట్‌ స్పీచ్‌)ను కట్టడి చేయడంలో తగిన విధంగా స్పందించడంలేదంటూ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై తాజాగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్‌, టెలికం దిగ్గజం వెరిజాన్‌ ధ్వజమెత్తాయి. ఇందుకు అనుగుణంగా ఫేస్‌బుక్‌లో ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించాయి. ఇదే అంశంపై పానీయాల దిగ్గజం కోక కోలా సైతం నెల రోజులపాటు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్‌ ఇవ్వడం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. హోండా మోటార్‌ కంపెనీ(యూఎస్‌ యూనిట్‌), చాకొలెట్ల సంస్థ హెర్షీ కో సైతం ఇదే స్థాయిలో స్పందించనున్నట్లు పేర్కొన్నాయి. పలు ఇతర కంపెనీలు సైతం ఈ బాటలో నడిచే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. హేట్‌ స్పీచ్‌లను సమర్ధవంతంగా నియంత్రించడంలేదంటూ కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై అమెరికాలో విమర్శలు అధికమైనట్లు పేర్కొన్నారు. 

షేరు పతనం
యూనిలీవర్‌, వెరిజాన్‌ ప్రకటనలతో వారాంతాన ఫేస్‌బుక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా సోషల్‌ మీడియా దిగ్గజం షేరు 8.5 శాతం పడిపోయి రూ. 216 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి కంపెనీ మార్కెట్‌ క్యాపిలైజేషన్‌(విలువ)లో 56 బిలియన్‌ డాలర్లమేర(సుమారు రూ. 4,20,000 కోట్లు) ఆవిరైంది. కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు 616 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రకటనలు, కంటెంట్‌ విధానాలలో ఇటీవల స్వల్ప మార్పులను చేపట్టినట్లు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గత వారం తమ కంపెనీ ఉద్యోగులకు తెలియజేశారు. అయితే ఈ మార్పులు విమర్శకులను మెప్పించలేకపోయినట్లు పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ మార్పులు చెప్పుకోదగ్గవి కాదంటూ పౌరహక్కుల సంఘాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీపై ఇప్పటికే కొన్ని అంశాలపై యాంటీట్రస్ట్‌ దర్యాప్తులు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి.  

23 శాతం వాటా
మొత్తం యూఎస్‌లోని డిజిటల్‌ ప్రకటనల మార్కెట్లో ఫేస్‌బుక్‌ సుమారు 23 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు ఈమార్కెటర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని ప్రాపర్టీస్‌ ద్వారా ఫేస్‌బుక్‌ 3 బిలియన్లమంది యూజర్లను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. 2019లో కంపెనీ డిజిటల్‌ ప్రకటనల ఆదాయం 27 శాతం పుంజుకుని దాదాపు 70 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. కాగా.. హేట్‌ స్పీచ్‌లను గుర్తించి, తొలగించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసినట్లు కంపెనీ అధికారి కరోలిన్‌ ఎవర్‌సన్‌ వివరించారు.ఈ అంశాన్ని ప్రకటనల భాగస్వామ్య సంస్థలకు ఈమెయిల్‌ ద్వారా తెలియజేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement