పనిచేయడానికి బెస్ట్‌ ప్లేస్‌ ఇదే..

Facebook Best Place to Work, Apple Slips to 84th Spot - Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, అమెరికాలో పనిచేయడానికి బెస్ట్‌ ప్లేస్‌గా ముందంజలో నిలుస్తోంది. కూపర్టినోకి చెందిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మాత్రం తన ర్యాంకును కోల్పోయింది. గతేడాది 36వ స్థానంలో నిలిచిన ఆపిల్‌, ఈ ఏడాది 84వ స్థానానికి పడిపోయింది. దిగ్గజ ఉద్యోగ వెబ్‌సైట్‌ గ్లాస్‌డోర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ''100 బెస్ట్‌ ప్లేసెస్‌ టూ వర్క్‌ ఇన్‌ ది యూఎస్‌'' పేరుతో గ్లాస్‌డోర్‌ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఆపిల్‌ ఇప్పటికీ అత్యధిక రేటు కలిగిన ఎంప్లాయిర్‌గానే నిలుస్తోంది. గ్లాస్‌డోర్‌ రేటింగ్స్‌లో ఇది 5కి 4.3 రేటు సంపాదించుకుంది. పనిచేయడానికి ఉన్నతమైన ప్లేస్‌లో ఫేస్‌బుక్‌ అనంతరం గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ చోటు దక్కించుకుంది. దీని తర్వాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఇన్‌-అండ్‌-అవుట్‌ బర్గర్‌, గూగుల్‌లు ఉన్నాయి.

'' ఉద్యోగులు ఎక్కువగా ఫేస్‌బుక్‌లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. సంస్థ మిషన్ ఆధారిత సంస్కృతి, పారదర్శక నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది'' అని గ్లాస్‌డోర్‌ సీఈవో రోబర్ట్‌ హన్‌మాన్‌ చెప్పారు. అయితే టెక్‌ దిగ్గజం ఆపిల్‌ అత్యంత చెత్త వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ను ఆఫర్‌ చేస్తుందని గ్లాస్‌డోర్‌ తెలిపింది. ఈ కారణంతో ఆపిల్‌ తన స్థానాలను కోల్పోయినట్టు పేర్కొంది. గ్లాస్‌డోర్‌ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో ఎస్‌ఏపీ 11వ స్థానం, సేల్స్‌ఫోర్స్‌ 15వ స్థానం, లింక్‌డిన్‌ 21వ స్థానం, అడోబ్‌ 31వ స్థానం, మైక్రోసాఫ్ట్‌ 39వ స్థానం, స్పేస్‌ఎక్స్‌ 50వ స్థానాన్ని సంపాదించుకున్నాయి. 2016 నవంబర్‌ 1 నుంచి 2017 అక్టోబర్‌ 22 వరకు ఉద్యోగులు అందించిన కంపెనీ సమీక్షల ఆధారంగా గ్లాస్‌డోర్‌ ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top