టీసీఎస్‌కు స్వల్ప ఊరట

Epic Systems Case: US court halves fine on TCS to $420 million

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు ఓ కేసులో విధించిన జరిమానాను అమెరికా కోర్టు సగానికి తగ్గించింది. వాణిజ్య రహస్యాలకు సంబంధించి ఎపిక్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్‌ దాఖలు చేసిన కేసులో 940 మిలియన్‌ డాలర్ల (రూ.6,016 కోట్లు) జరిమానా చెల్లించాలని గతంలో అమెరికా కోర్టు టీసీఎస్‌తోపాటు టాటా అమెరికా ఇంటర్నేషనల్‌ కార్ప్‌ను ఆదేశించింది. దీనిపై టీసీఎస్‌ చేసిన అభ్యర్థనను పాక్షికంగా ఆమోదిస్తూ, జరిమానాను 420 మిలియన్‌ డాలర్ల(రూ.2,688 కోట్లు)కు తగ్గిస్తూ అమెరికాలోని వెస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆఫ్‌ విస్కాన్సిన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టీసీఎస్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది.

అయితే, విచారణలో తాము అందజేసిన ఆధారాల ప్రకారం చూస్తే మొదటి సారి తీర్పు, రెండోసారి జరిమానా తగ్గిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఏవీ సమర్థనీయంగా లేవని, వీటిపై ఉన్నత న్యాయ స్థానంలో అప్పీలు చేయవచ్చంటూ న్యాయ సలహా అందినట్టు టీసీఎస్‌ పేర్కొంది. టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషనల్‌ కార్ప్‌లకు వ్యతిరేకంగా ఎపిక్‌ 2014లో మాడిసన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వాణిజ్య రహస్యాలను, సున్నిత సమాచారం, డాక్యుమెంట్లును తస్కరించినట్టు ఆరోపించింది. దీంతో సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించినందుకు 240 మిలియన్‌ డాలర్లు(రూ.1,536 కోట్లు), మరో 700 మిలియన్‌ డాలర్ల(రూ.4,480 కోట్లు)ను నష్ట పరిహారంగా చెల్లించాలని అక్కడి కోర్టు ఆదేశించింది.

Back to Top