జపాన్‌–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 

Elimination of tariffs on various products imports - Sakshi

పలు ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల ఎత్తివేత 

అమెరికా రక్షణాత్మక   ధోరణులపై ధిక్కారం  

టోక్యో: రక్షణాత్మక ధోరణులతో వాణిజ్య యుద్ధాలకు కాలుదువ్వుతున్న అమెరికా ధోరణులను ధిక్కరిస్తూ జపాన్, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం యూరోపియన్‌ యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తులపై జపాన్‌ చాలా మటుకు టారిఫ్‌లు ఎత్తివేయనుంది. బియ్యం మినహా చీజ్‌ తదితర ఉత్పత్తులు అనేకం ఈ జాబితాలో ఉండనున్నాయి. అలాగే, జపాన్‌ ఉత్పత్తులపై దాదాపు 99 శాతం మేర టారిఫ్‌లను ఈయూ ఎత్తివేయనుంది. కార్ల విడిభాగాలపై టారిఫ్‌లను తక్షణం ఎత్తివేయనుండగా, డీల్‌ అమల్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత నుంచి కార్ల మీద కూడా లెవీలు తొలగించనుంది.

ఈ ఒప్పందం ద్వారా రక్షణాత్మక విధానాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నది తమ లక్ష్యమని ఈయూ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ టస్క్‌ పేర్కొన్నారు. అమెరికా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా దాని తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయంగా రక్షణాత్మక ధోరణులు పెరుగుతున్న తరుణంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గదర్శకత్వం వహించేందుకు జపాన్, ఈయూ కట్టుబడి ఉన్నాయని ఒప్పందం సందర్భంగా జపాన్‌ అధ్యక్షుడు షింజో అబే తెలిపారు. ఈ ఒప్పందాన్ని అటు యూరోపియన్‌ యూనియన్, ఇటు జపాన్‌ చట్టసభలు ఇంకా ఆమోదించాల్సి ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top