వ్యాపారానికి అడ్డంకులు తొలగించండి

Eliminate barriers to business - Sakshi

డేటా లోకలైజేషన్‌ వంటి  ఆంక్షలు ఎత్తేయండి

భారత్‌ను కోరిన అమెరికా  

న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కంపెనీల వ్యాపార వ్యయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ కోరారు. అమెరికన్‌ కంపెనీలు భారత్‌లో వ్యాపారాలు నిర్వహించుకోవడానికి గల అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. డేటా లోకలైజేషన్‌ వంటి ఆంక్షల వల్ల డేటా భద్రత బలహీనపడుతుందని, వ్యాపారాల నిర్వహణ వ్యయాలు పెరిగిపోతాయని.. ఇలాంటి వాటిని తొలగించాలని రాస్‌ చెప్పారు. భారత పర్యటనలో భాగంగా ట్రేడ్‌ విండ్స్‌ ఫోరం అండ్‌ ట్రేడ్‌ మిషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌తో వాణిజ్య చర్చలు జరపడం, అమెరికా–ఇండియా సీఈవో ఫోరం ద్వారా సమస్యాత్మక అంశాలను పరిష్కరించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.  

అధిక టారిఫ్‌ల భారం.. 
‘ప్రస్తుతం భారత మార్కెట్లో అమెరికా వ్యాపార సంస్థలు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. టారిఫ్‌లు, టారిఫ్‌యేతర అంశాలూ ఇందుకు కారణంగా ఉంటున్నాయి. వివిధ నియంత్రణ చట్టాలు విదేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. భారత్‌లో సగటున టారిఫ్‌ల రేటు ప్రపంచంలో ఇతర దేశాలన్నింటి కన్నా చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు ఆటోమొబైల్‌పై అమెరికాలో సుంకాలు 2.5 శాతం మాత్రమే కాగా.. భారత్‌లో 60 శాతం ఉంటున్నాయి. మోటార్‌సైకిళ్లపై 50 శాతం, ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌పై ఏకంగా 150 శాతం ఉంటున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉంది‘ అని రాస్‌ పేర్కొన్నారు. వైద్య పరికరాల ధరలపై నియంత్రణ, ఎలక్ట్రానిక్స్‌.. టెలికమ్యూనికేషన్స్‌ ఉత్పత్తుల రేట్లపై ఆంక్షలు మొదలైనవి అమెరికా కంపెనీలకు పెద్ద అడ్డంకులుగా ఉంటున్నాయన్నారు. భారత్‌ నుంచి దిగుమతయ్యే రూటర్లు, స్విచ్‌లు, సెల్‌ఫోన్స్‌ విడిభాగాలు మొదలైన వాటిపై అమెరికాలో సుంకాలు సున్నా స్థాయిలో ఉండగా.. భారత్‌లో మాత్రం అత్యధికంగా 20 శాతంగా ఉన్నాయని రాస్‌ చెప్పారు. త్వరలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఇలాంటి అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top