
రేపటి నుంచి ప్రీ–ఆర్డర్లు ప్రారంభం
రూ. 82,900 నుంచి రూ. 2.3 లక్షల వరకు ధర శ్రేణి
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్ల శ్రేణి విక్రయాలు సెప్టెంబర్ 19 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంటుంది. ఎయిర్ పేరిట యాపిల్ అత్యంత పల్చని ఐఫోన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ–సిమ్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
కొత్త ఐఫోన్ మోడల్స్‌లో 128 జీబీ స్టోరేజీ ఆప్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. దీంతో ఐఫోన్ 16 సిరీస్‌తో పోలిస్తే బేస్ మోడల్స్ ధర పెరిగింది. భారత్ సహా 63 దేశాల్లోని కస్టమర్లు సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌ని ప్రీ–ఆర్డర్ చేయొచ్చని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 17 ఫోన్లు 256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో లభిస్తాయి.
ఎయిర్ సిరీస్ 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఏ19 చిప్‌సెట్ వల్ల ఐఫోన్ 16తో పోలిస్తే కొత్త ఐఫోన్ 20% అధికం, ఐఫోన్ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పని చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ‘ప్లస్’ మోడల్స్ ఏవీ లేవు. ప్రో మ్యాక్స్‌లో తొలిసారిగా 2టీబీ ఆప్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కి కూడా ఉపయోగపడేలా వాచ్ 3 అల్ట్రాను కూడా యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 89,900గా ఉంటుంది. ప్రీ–ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.