క్షీణించిన వ్యాపార విశ్వాసం... | Dun & Bradstreet Corporation (The) (DNB) Shares Bought | Sakshi
Sakshi News home page

క్షీణించిన వ్యాపార విశ్వాసం...

Jan 11 2017 12:25 AM | Updated on Sep 5 2017 12:55 AM

వ్యాపార విశ్వాసం క్షీణించింది. ఇది 2017 జనవరి–మార్చి క్వార్టర్‌కి 31 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడింది. కంపెనీలపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావం చూపింది.

31 త్రైమాసికాల కనిష్టానికి చేరిక
డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ నివేదిక


న్యూఢిల్లీ: వ్యాపార విశ్వాసం క్షీణించింది. ఇది 2017 జనవరి–మార్చి క్వార్టర్‌కి 31 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడింది. కంపెనీలపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావం చూపింది. నగదు కొరతతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ కంపొసైట్‌ బిజినెస్‌ ఆప్టిమిజమ్‌ ఇండెక్స్‌ 2017 తొలి త్రైమాసికంలో 65.4 వద్ద ఉంది. 2016 జన వరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే సూచీలో 23.9 శాతం క్షీణత నమోదయ్యింది. ‘కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల డిమాండ్‌ పడిపోయింది. అలాగే కంపెనీల ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడింది’ అని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కుశాల్‌ సంపత్‌ తెలిపారు.

డీమోనిటైజేషన్‌ వల్ల దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని, నల్లధనం తగ్గుతుందని చెప్పారు. కానీ ప్రస్తుతం నగదు కొరత ఏర్పడటంతో డిమాండ్‌ తగ్గిందని పేర్కొన్నారు. అలాగే కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, వాటి వ్యాపార విశ్వాసం క్షీణించిందని తెలిపారు. జీఎస్‌టీ అమలుపై నెలకొని ఉన్న సందిగ్ధత కూడా వ్యాపార విశ్వాసాన్ని ప్రభావితం చేస్తోందని చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలోని నగదు కొరత వల్ల పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గింది. దీని ప్రభావం 2017 తొలి త్రైమాసికంలో కంపెనీల నికర అమ్మకాలపై కనిపిస్తుంది. దీంతో వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది’ అన్నారు.

కార్పొరేట్‌ ఆదాయాలకు దెబ్బ: క్రిసిల్‌
మూడు వరుస త్రైమాసికాల వృద్ధి తర్వాత మోదీ సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయం ఫలితంగా కార్పొరేట్‌ ఆదాయాలు... గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో క్షీణ బాట పట్టనున్నాయి. 4 శాతం తగ్గుతాయని క్రిసిల్‌ అంచనా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement