‘పన్ను’ ఊరట!

Dividend distribution Tax May Decrease By Department Of Economic Affairs - Sakshi

ఎల్‌టీసీజీ, ఎస్‌టీటీ, డీడీటీల్లో మార్పులు

పీఎంవో, ఆర్థిక శాఖ సమీక్ష నవంబర్‌ నాటికి కసరత్తు పూర్తి

బడ్జెట్‌లో లేదా అంతకు ముందే ప్రకటించే అవకాశాలు

న్యూఢిల్లీ: మందగమన బాటలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును మెరుగుపర్చేందుకు, విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు.. మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనుంది. దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ) ట్యాక్స్, సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ), డివిడెండ్‌ పంపిణీ పన్ను (డీడీటీ)లను తగ్గించే విధంగా.. వాటి స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీతి అయోగ్, ఆర్థిక శాఖలో భాగమైన రెవెన్యూ విభాగంతో కలిసి ప్రధాని కార్యాలయం (పీఎంవో) వీటిని సమీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నవంబర్‌ ఆఖరు నాటికి దీనిపై కసరత్తు పూర్తి కావచ్చు. బడ్జెట్‌లో లేదా అంతకన్నా ముందే ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చు‘ అని వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న కేంద్రం ప్రవేశపెట్టవచ్చని అంచనా.

సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్, బీమా తదితర రంగాల సంస్థలు.. దేశీ ఈక్విటీల్లో మరింత పెట్టుబడులు పెంచేందుకు ప్రోత్సహించే విధంగా ..ఇతర దేశాలకు దీటుగా దేశీయంగా పన్ను రేట్లను సవరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. ‘ఈక్విటీ, డెట్, కమోడిటీల మార్కెట్ల పన్ను రేట్లను సమీక్షిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెన్షన్‌ ఫండ్స్‌ నుంచి దేశీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు ఆకర్షించాలంటే పెద్ద ప్రతిబంధకంగా ఉంటోందన్న అభిప్రాయాల నేపథ్యంలో డీడీటీని గణనీయంగా తగ్గించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పన్నులను సమీక్షించేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌.. దీన్ని ఏకంగా తొలగిం చాలని సిఫార్సు చేసింది‘ అని వివరించారు.

ఎల్‌టీసీజీ..డీడీటీ..ఏంటంటే.. 
షేర్ల విక్రయంతో ఇన్వెస్టరుకు లాభాలు వచ్చిన పక్షంలో క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పైబడి అట్టే పెట్టుకున్న షేర్లను విక్రయిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం ఎల్‌టీసీజీ అమల్లోకి వచ్చింది. ఒకవేళ లాభాలు రూ. లక్ష దాటితేనే ఇది వర్తిస్తుంది. ఏడాది వ్యవధి లోపే షేర్లను విక్రయించిన పక్షంలో స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎస్‌టీసీజీ) ట్యాక్స్‌ 15% మేర వర్తిస్తుంది. ఇక, కంపెనీలు తమ వాటాదారులకు పంచే డివిడెండుపై ప్రస్తుతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(సెస్సులు, సర్‌చార్జీలన్నీ కలిపి) 20.35% స్థాయిలో ఉంటోంది. ఎల్‌టీసీజీ, డీడీటీలపై దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు.

రూ. 1.5 లక్ష కోట్ల ఆదాయానికి గండి.. 
పన్ను రేట్లలో కోతలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను మరింతగా విక్రయించడం, పన్ను రాబడులను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి చర్యలతో దీన్ని భర్తీ చేసుకోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత కొద్ది నెలలుగా పలు సంస్కరణలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్‌ ట్యాక్స్‌  తగ్గింపు, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై మరింత దూకుడు, బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులను వినియోగించుకునేలా ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ  బ్యాంకులు.. చిన్న సంస్థలకు రుణాలిచ్చేలా చర్యలు వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆగ్నేయాసియా మొత్తం మీద భారత్‌లోనే కార్పొరేట్‌ ట్యాక్స్‌ తక్కువగా ఉంది. ఈ సంస్కరణలు.. దేశీ స్టాక్‌ మార్కెట్లకు, ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిస్తున్నాయి.

ఆదాయపు పన్ను రేటూ తగ్గింపు: డీబీఎస్‌
కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటును కూడా భారత్‌ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సింగపూర్‌కి చెందిన డీబీఎస్‌ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచవచ్చని వివరించింది. రూ. 5 లక్షలకు పైబడిన ఆదాయాలపైనా ట్యాక్స్‌ రేటును తగ్గించవచ్చని తెలిపింది. దీని వల్ల చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని, మధ్య స్థాయిలో ఉన్న వారికీ ఓ మోస్తరు ఊరట లభించగలదని.. పై స్థాయి శ్లాబ్‌లో ఉన్న వారికి మాత్రమే పన్ను భారం పెరగవచ్చని డీబీఎస్‌ బ్యాంకు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top