మోదీ సర్కారు తొలి ఆరు నెలల్లో సాధించిన పలు విజయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ..
న్యూఢిల్లీ: మోదీ సర్కారు తొలి ఆరు నెలల్లో సాధించిన పలు విజయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన ధన యోజన(పీఎంజేడీవై), వరిష్ట పెన్షన్ బీమా యోజన(వీపీబీవై), నల్లధనంపై పోరు వంటి కీలకాంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కితెచ్చేందుకు తక్షణం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
అదేవిధంగా పన్ను ఎగవేతలు, నల్లధనానికి చెక్ చెప్పేందుకు పన్నుల సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఎక్స్ఛేంజ్ చేసుకునే అంతర్జాతీయ వ్యవస్థ అమలుకు భారత్ మద్దతు పలికిందని పేర్కొంది. జన ధన పథకం కింద వచ్చే జనవరి 26 నాటికి 7.5 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిపించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అనూహ్య స్పందనతో ఈ లక్ష్యాన్ని 10 కోట్లకు పెంచినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
ఈ నెల 23 నాటికి 9.91 కోట్ల జన ధన ఖాతాలు ప్రారంభమైనట్లు వెల్లడించింది. ఇక ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేందుకు వీలుగా కిసాన్ వికాస పత్రాల(కేవీపీ)ను ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపింది. ఆటోమొబైల్, యంత్రపరికరాల రంగాలకు చేయూతనిచ్చేందుకు సుంకాల్లో రాయితీని ఈ డిసెంబర్ 31 వరకూ పొడిగించిన విషయాన్ని గుర్తుచేసింది.