
న్యూఢిల్లీ : టాప్- ప్రొఫైల్ ఫ్యాషన్ డిజైనర్లు ఆదాయపు పన్ను శాఖ చేతికి చిక్కారు. పెద్ద మొత్తంలో పన్నులు ఎగ్గొట్టినందుకు ఢిల్లీలోని వీరి షోరూంలపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 25 మంది డిజైనర్లు షోరూంలు, నివాసాలను ఆదాయపు పన్ను అధికారులు సెర్చ్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దాడులు పలు గంటల పాటు జరిగినట్టు తెలిసింది. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో అనుమానిత లావాదేవీలను గుర్తించినట్టు ఐటీ డిపార్ట్‌మెంట్ వర్గాలు చెప్పాయి. పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసినట్టు పేర్కొన్నాయి. డిఫెన్స్ కాలనీ, ఖాన్ మార్కెట్, మహిపాల్‌పూర్, గ్రేటర్ కైలాష్ వంటి ప్రాంతాల్లో ఉన్న షోరూంలలో ఈ దాడులు జరిపినట్టు తెలిపాయి.
ఉత్తర ఢిల్లీలో ఉన్న గాయకుడు నరేంద్ర ఛాంచల్ నివాసంలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పన్నుఎగవేతతో ఆయన కొడుకును ఐటీ వర్గాల కనుసన్నలోకి వచ్చేశారు. ఢిల్లీ నివాసంలో మాత్రమే కాక, ఆయన పూర్వీకుల ఇంటిలో కూడా దాడులు నిర్వహించి, పలు డాక్యుమెంట్లను సీజ్ చేసింది. దేశరాజధానిలో ఈ నెలలో జరిగిన అతిపెద్ద దాడిలో ఇదీ ఒకటి. మే 22న ఐటీ డిపార్ట్‌మెంట్ రూ.215 కోట్లకు పైన నల్లధనాన్ని గుర్తించింది. టాప్ డిజైనర్ నివాసాలు, గాయకుడి నివాసంలో మాత్రమే కాక, ఢిల్లీలోని దిగ్గజ కేటరింగ్, టెంట్ ఆపరేటర్లపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా రూ.100 కోట్లకు పైగా బ్లాక్‌మనీని వెలికితీసింది. కోట్ల రూపాయల నగదును, జువెల్లరీని సీజ్ చేసింది.