ఈడీకి హైకోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కామ్‌ : ఈడీకి హైకోర్టు నోటీసులు

Published Wed, Mar 7 2018 12:16 PM

Delhi HC Serves Notice To ED Over Nirav Modi Plea In PNB Scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) స్కామ్‌కు సంబంధించి పరారీలో ఉన్న బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పేర్కొన్న మొత్తంపై స్పష్టత లేదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఈడీ ఏ అధికారాలతో ఆస్తుల సోదాకు వెళ్లిందో స్పష్టత కొరవడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని..దీనిపై ఈడీ ఏం చెబుతుందో వేచిచూస్తామని పేర్కొంది. కేసు వివరాలపై నీరవ్‌ మోదీ న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ సైతం గందరగోళంలో ఉన్నారంటూ కేసు విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని, కేసు వివరాలు అసమగ్రంగా ఉన్నాయని కోర్టు ఈడీకి తెలిపిందని అనంతరం నీరవ్‌ న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ చెప్పారు.

పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్‌ మోదీని, ఆయన సంస్ధలను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ఇటీవల డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నీరవ్‌ మోదీని ఆయనకు చెందిన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ ఇంటర్నేషనల్‌, రాధాశిర్‌ జ్యూవెలర్‌ కంపెనీలను ప్రాసిక్యూట్‌ చేయనున్నారు. పీఎన్‌బీ స్కామ్‌లో కీలక నిందితుడు నీరవ్‌ మోదీని తమ ఎదుట హాజరు కావాలని కోరుతూ ఇప్పటికే ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

విచారణకు హాజరయ్యేందుకు నీరవ్‌ నిరాకరించడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ ఈడీ మనీల్యాండరింగ్‌ నిరోధక కోర్టు (పీఎంఎల్‌ఏ)ను ఆశ్రయించింది.

Advertisement
Advertisement